చెన్నై జోరుకు ఎదురు నిలిచేనా?

17 Apr, 2019 06:50 IST|Sakshi
అటు ఇటుగా కోచింగ్‌

హ్యాట్రిక్‌ ఓటములతో హైదరాబాద్‌ డీలా

నేడు సూపర్‌కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌

సాక్షి, హైదరాబాద్‌: లీగ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పటిష్ట చెన్నై సూపర్‌ కింగ్స్‌తో నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. సమష్టిగా రాణిస్తూ నాకౌట్‌కు చేరువగా వచ్చిన ధోనిసేనపై గెలుపొంది మళ్లీ విజయాల బాట పట్టాలని సన్‌రైజర్స్‌ భావిస్తోంది. వరుసగా మూడు పరాజయాలు ఎదుర్కొని నిరాశలో ఉన్న విలియమ్సన్‌ సేన ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలుపొందాలనే లక్ష్యంతో బరిలో దిగనుంది. మరోవైపు సన్‌రైజర్స్‌పై నెగ్గి ఈ మ్యాచ్‌తోనే ప్లే ఆఫ్‌ బెర్తు ఖరారు చేసుకోవాలని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఉవ్విళ్లూరుతోంది. ఇదే జరిగితే ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా చెన్నై నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం మరో హోరాహోరీ పోరుకు సిద్ధమైంది. 

సమష్టి ప్రదర్శన
ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు. లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జోరు ఎలా సాగుతుందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. బ్యాటింగ్‌లోనే కాకుండా ఆ జట్టు బౌలింగ్‌లోనూ చెలరేగుతూ ప్రత్యర్థులను పడగొడుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓవరాల్‌గా పవర్‌ ప్లేలో 7.1 ఎకానమీ, మిడిలార్డర్‌లో 6.5, డెత్‌ ఓవర్లలో కేవలం 8.3 ఎకానమీతో ఐపీఎల్‌లో రెండో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. మరోవైపు పటిష్ట బౌలింగ్‌ దళంగా పేరుగాంచిన సన్‌రైజర్స్‌ ఈ విషయంలో చెన్నైతో పోలిస్తే వెనుకబడింది. డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌ భువనేశ్వర్‌ ఎకానమీ 12.6గా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు చెన్నై తరఫున పెద్దగా రాణించని అంబటి రాయుడు కూడా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో అర్ధసెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. ప్రపంచ కప్‌ బెర్తును ఆశించి భంగపడిన అతను సొంతగడ్డపై సన్‌రైజర్స్‌పై చెలరేగి తన విలువను చాటుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. టాపార్డర్‌లో వాట్సన్, డు ప్లెసిస్, రైనా ఆకట్టుకుంటున్నారు. మరోవైపు ధోని వ్యూహాలను పక్కాగా అమలు చేస్తూ బౌలర్లు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాహిర్, హర్భజన్, సాన్‌ట్నర్‌ అద్భుతంగా రాణిస్తున్నారు.

కలవరపరుస్తోన్న మిడిలార్డర్‌
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను కలవరపరిచే అంశం మిడిలార్డర్‌. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మిడిలార్డర్‌ కుప్పకూలిన తీరు బాధాకరం. గెలిచే దశ నుంచి మ్యాచ్‌ను చిత్తుగా ఓడిన హైదరాబాద్‌ ఆ ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు. వార్నర్, బెయిర్‌స్టో అందిస్తున్న శుభారంభాలను మిగతా బ్యాట్స్‌మెన్‌ కొనసాగించలేకపోతున్నారు. దీంతో వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకొని సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టికలో వెనుకబడింది. వార్నర్‌ (400 పరుగులు), బెయిర్‌స్టో (304 పరుగులు) జట్టును ముందుండి నడిపిస్తుండగా... ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లాడిన మనీశ్‌ పాండే 54 పరుగులు, దీపక్‌ హుడా 47 పరుగులు, యూసుఫ్‌ పఠాన్‌ 32 పరుగులే చేయడం మిడిలార్డర్‌ వైఫల్యాన్ని చూపిస్తోంది. విజయ్‌ శంకర్‌ (132 పరుగులు) పరవాలేదనిపిస్తున్నాడు. ప్రస్తుతం మళ్లీ జట్టును గెలుపు బాట పట్టించాల్సిన బాధ్యత బౌలర్ల పైనే ఉంది. రషీద్, నబీలతో పాటు పేసర్లు భువనేశ్వర్, సిద్ధార్థ్‌ కౌల్, అహ్మద్‌ ఖలీల్‌ రాణించి చెన్నైని తక్కువ స్కోరుకు పరిమితం చేస్తే హైదరాబాద్‌ గెలిచే అవకాశం ఉంటుంది.  

ప్లే ఆఫ్‌ బెర్త్‌ ఖరారు కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌... మళ్లీ గెలుపు బాట పట్టేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో తలపడనున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లు మంగళవా రం ప్రాక్టీస్‌ చేశారు.  కాగా చెన్నై కోచ్‌ ఫ్లెమింగ్‌ సన్‌రైజర్స్‌ ఆటగాళ్లకు సలహాలివ్వగా.. సన్‌రైజర్స్‌ కోచ్‌ టామ్‌మూడీ చెన్నై ప్లేయర్‌ బ్రావోకు సూచనలిచ్చారు.

మరిన్ని వార్తలు