మేఘమా ఉరమకే ఈ పూటకి!

13 Oct, 2017 04:32 IST|Sakshi

నేడు భారత్, ఆస్ట్రేలియా చివరి టి20

సిరీస్‌ గెలుపే ఇరు జట్ల లక్ష్యం

భాగ్యనగరాన్ని వీడని వర్షం

రాత్రి గం. 7.00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 118... రెండో మ్యాచ్‌లో భారత్‌ 118... పైగా వర్షం ఆటంకం కలిగించిన మొదటి మ్యాచ్‌లో భారత్‌ ఆరు ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేదు. తాజా సిరీస్‌లో పరుగుల పరిస్థితి ఇది. భారత్, ఆస్ట్రేలియా మధ్య పోరులో ఇప్పటి వరకు అభిమానులకు ఆశించిన ధనాధన్‌ వినోదం దక్కలేదు. ఇక ఇప్పుడు సిరీస్‌ ఫలితాన్ని తేల్చే చివరి టి20లోనైనా బ్యాట్స్‌మెన్‌ విరుచుకు పడతారా? వన్డే సిరీస్‌లాగే ఇది కూడా భారత్‌ ఖాతాలో చేరుతుందా? లేక నిరాశాజనక పర్యటనను కంగారూలు విజయంతో ముగిస్తారా? హైదరాబాద్‌ మ్యాచ్‌ ఎవరి ఖాతాలో చేరుతుందో మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.

వర్షం, భారీ వర్షం, అతి భారీ వర్షం... గత కొద్ది రోజులుగా భాగ్యనగర వాసులకు ఈ పదాలు రొటీన్‌లో భాగంగా మారిపోయాయి. నగరాన్ని వరుసగా వానలు ముంచెత్తుతున్న సమయంలో క్రికెట్‌ అభిమాని మాత్రం వరుణ దేవుడిని ఒక్కరోజు సెలవు తీసుకొమ్మని కోరుకుంటున్నాడు. వానలో కాకుండా పరుగుల వానలో తాము తడిసి ముద్దవ్వాలని పరితపిస్తున్నాడు. ఆటగాళ్లంతా సిరీస్‌ విజయం కోసం సిద్ధమైనా... ఆటమాత్రం వాన రాకడపైనే ఆధారపడి ఉంది.   

సాక్షి, హైదరాబాద్‌ : సొంతగడ్డపై ఏడాది ఆరంభంలో టెస్టు సిరీస్, ఇటీవల వన్డే సిరీస్‌లలో ఆస్ట్రేలియాపై స్పష్టమైన ఆధిక్యం కనబర్చిన భారత జట్టు ఇప్పుడు టి20 సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకొని మూడు ఫార్మాట్ల ముచ్చటను పూర్తి చేయాలని భావిస్తోంది. గెలుపే లక్ష్యంగా నేడు జరిగే చివరి టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. అటు తనకు అచ్చొచ్చిన మైదానంలో మరో విజయం సాధించి సగర్వంగా స్వదేశం వెళ్లాలని ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆస్ట్రేలియా తాత్కాలిక సారథి డేవిడ్‌ వార్నర్‌ కూడా పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను చూస్తే హోరాహోరీ పోరు ఖాయమనిపిస్తోంది.

రాహుల్‌ లేదా కార్తీక్‌కు చాన్స్‌...
రెండో టి20 మ్యాచ్‌లో భారత్‌ టాప్‌–4 అనూహ్య వైఫల్యం జట్టుకు పరాజయం తప్ప మరో దారి లేకుండా చేసింది. దాని నుంచి పాఠం నేర్చుకొని అత్యుత్తమ ఆటతీరు కనబర్చాలని ఆటగాళ్లు భావిస్తున్నారు. రోహిత్, ధావన్‌లతో పాటు కోహ్లి కూడా సత్తా చాటాల్సి ఉంది. అయితే నాలుగో స్థానంలో మాత్రం పదే పదే విఫలమవుతున్న మనీశ్‌ పాండే స్థానంలో లోకేశ్‌ రాహుల్‌ లేదా దినేశ్‌ కార్తీక్‌ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. కార్తీక్‌ గురువారం సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. మరోవైపు హార్దిక్‌ పాండ్యాకు గువాహటి మ్యాచ్‌కు ముందు ఎక్కువ సందర్భాల్లో తగినన్ని బంతులు ఆడే అవకాశమే రాలేదు. కానీ గత మ్యాచ్‌లో పదో ఓవర్లో బరిలోకి దిగినా ఒత్తిడిలో అతడి నుంచి ఆశించిన ఆటను ప్రదర్శించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లోనైనా అతను తన శైలి మెరుపులను చూపిస్తే భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. కేదార్‌ జాదవ్, ధోని కూడా మరింత సమర్థంగా తమ పాత్రను పోషించాల్సి ఉంది. హైదరాబాద్‌ పిచ్‌పై భువనేశ్వర్‌కు అద్భుతమైన పట్టు ఉంది. పేసర్లకు కూడా ఆరంభంలో అనుకూలించే ఈ వికెట్‌పై అతను ఎన్నో అద్భుతమైన స్పెల్స్‌ ఐపీఎల్‌లో వేశాడు. భువీకి తోడుగా బుమ్రా నిలిస్తే భారత్‌కు తిరుగుండదు. గత మ్యాచ్‌లోనూ వీరిద్దరు రాణించినా స్పిన్నర్లపై ఎదురుదాడితో ఆసీస్‌ ఫలితం సాధించింది. కాబట్టి చహల్, కుల్దీప్‌లు ఈ సారి మరింత జాగ్రత్తగా బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. నెహ్రా విలేకరుల సమావేశానికి హాజరైనా... మ్యాచ్‌ ప్రాధాన్యత దృష్ట్యా మళ్లీ అవకాశం లభించకపోవచ్చు.  
వార్నర్‌ చెలరేగుతాడా...: ఐపీఎల్‌ సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా అద్భుతమైన విజయాలు సాధించిన మైదానంలో బ్యాట్స్‌మన్‌గా డేవిడ్‌ వార్నర్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఉప్పల్‌లో ఏకంగా 162.79 స్ట్రైక్‌రేట్‌తో అతను ఇక్కడ 1,291 పరుగులు చేశాడు. కాబట్టి అది కచ్చితంగా వార్నర్‌కు సానుకూలాంశం. ఫించ్‌కు ఎప్పటిలాగే చెలరేగిపోగల సామర్థ్యం ఉంది. గత మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌కు బ్యాటింగ్‌ అవకాశం రాలేదు. పేలవమైన పర్యటనను అతను ఇప్పుడైనా మెరుగ్గా ముగిస్తాడా చూడాలి. మరో సన్‌రైజర్స్‌ ఆటగాడు హెన్రిక్స్‌ కూడా ప్రమాదకారి కాగలడని గత మ్యాచ్‌లోనే నిరూపితమైంది. టూర్‌ ఆరంభంలో తడబడ్డ స్టొయినిస్, హెడ్, జంపా నిలదొక్కుకోవడం ఆసీస్‌కు అదనపు బలం. ఇక గత మ్యాచ్‌లో చెలరేగిన బెహ్రెన్‌డార్ఫ్‌కు పిచ్‌ కాస్త అనుకూలించినా చెలరేగిపోగలడు. ఈ టూర్‌ మొత్తంలో ఇప్పుడు కాస్త ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న కంగారూలు ఎలాంటి ఫలితం సాధిస్తారనేది ఆసక్తికరం.

తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రోహిత్, పాండే/కార్తీక్, జాదవ్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, బుమ్రా, చహల్, కుల్దీప్‌.  
ఆస్ట్రేలియా: వార్నర్‌ (కెప్టెన్‌), ఫించ్, హెన్రిక్స్, హెడ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, పైన్, కూల్టర్‌ నీల్, టై, జంపా, బెహ్రెన్‌డార్ఫ్‌.

పిచ్, వాతావరణం
ఉప్పల్‌ మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌. ఐపీఎల్‌లో మాత్రం ఎక్కువ భాగం సాధారణ స్కోర్లే నమోదయ్యాయి. ముఖ్యంగా పేస్‌ బౌలింగ్‌కు ఈ పిచ్‌ ఆరంభంలో చక్కగా సహకరిస్తుంది. వరుసగా వర్షాలు పడుతుండటంతో పిచ్‌ను సిద్ధం చేయడం కష్టంగా మారినా... దానిని వాన బారిన పడకుండా కప్పి ఉంచడంలో హెచ్‌సీఏ సిబ్బంది సఫలమయ్యారు. అయితే అవుట్‌ఫీల్డ్‌ మాత్రం గురువారం సాయంత్రం కూడా బురదమయంగా, ప్రమాదకరంగానే కనిపించింది. మ్యాచ్‌కు ముందు రోజు కూడా వాన కురవడం ప్రతికూల పరిణామమే. తాజా వాతావరణ పరిస్థితిని బట్టి చూస్తే  మ్యాచ్‌ అంతరాయం లేకుండా సజావుగా సాగడం కష్టంగానే కనిపిస్తోంది. క్యురేటర్‌ కస్తూరి శ్రీరామ్‌ పిచ్‌ను ఎలాగైనా సిద్ధం చేస్తామనే విశ్వాసంతో ఉన్నారు.  

►19 భారత్‌లో అంతర్జాతీయ టి20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న 19వ వేదిక ఉప్పల్‌ స్టేడియం

మరిన్ని వార్తలు