గెలిస్తే సరి.. ఓడితే సిరీస్‌ హరీ!

23 Nov, 2018 01:35 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

తప్పులు దిద్దుకునే ప్రయత్నంలో టీమిండియా

నేడు మెల్‌బోర్న్‌లో రెండో టి20

గెలుపు ఊపులో ఆస్ట్రేలియా

మధ్యాహ్నం గం.1.20 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్‌–3లలో ప్రత్యక్ష ప్రసారం  

ఆడిన చివరి ఐదు టి20ల్లో... టీమిండియా ఒక్క దాంట్లోనే ఓడింది. ఆస్ట్రేలియా ఒక్క దాంట్లోనే గెలిచింది! ‘ఈ ఒక్కటీ’ బుధవారం నాటి మ్యాచ్‌. రెండు జట్ల ఇటీవలి ఫామ్‌కు అద్దం పట్టే ఈ గణాంకాలివీ. ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత్‌ పొరపాట్లతో పరాజయం పాలైంది. పరిస్థితులు కలిసొచ్చి అనూహ్య విజయంతో ఆసీస్‌ ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. కంగారూ గడ్డపై ‘పొట్టి ఫార్మాట్‌’లో నెగ్గాలంటే మరింత  పకడ్బందీగా ఉండాలని కోహ్లి సేనకు తెలిసొచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఫించ్‌ బృందాన్ని ఎలా నిలువరిస్తుందో చూడాలి.  

మెల్‌బోర్న్‌: వరుసగా ఎనిమిదో టి20 సిరీస్‌ గెలిచే ఘనత చేజారకుండా ఉండాలన్నా, కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం చిక్కకుండా చేయాలన్నా... విజయం తప్పనిసరైన పరిస్థితుల్లో టీమిండియా శుక్రవారం ఆస్ట్రేలియాతో రెండో టి20 ఆడనుంది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ) వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో కోహ్లి సేన సరైన కూర్పుతో దిగితేనే అనుకూల ఫలితం రాబట్టే వీలుంటుంది. మరోవైపు కష్ట కాలంలో భారత్‌లాంటి జట్టుపై నెగ్గడం కంగారూలకు ఊపిరి పోసింది. ఆటలో ‘బుద్ధి బలం’ కంటే ‘భుజ బలం’దే పైచేయిగా నిలుస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోనే పెద్ద మైదానమైన మెల్‌బోర్న్‌లో ఏ జట్టు ఎక్కువ బౌండరీలు, సిక్స్‌లు బాదుతుందో దానిదే గెలుపు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం తప్పేలా లేదు. కాబట్టి రన్‌రేట్‌నూ దృష్టిలో పెట్టుకోక తప్పదు.

కూర్పు మార్చాల్సిందే...
‘కొందరు భారత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్‌ చూస్తే వారు నిన్ననే ఆస్ట్రేలియా వచ్చినట్లున్నారు’ తొలి టి20 సందర్భంగా వినిపించిన వ్యాఖ్యలివి. మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ పొరపాట్లను చూస్తే ఇది నిజమేననిపించింది. అయితే, బ్యాటింగ్‌లో శిఖర్‌ ధావన్‌ మంచి టచ్‌లో ఉండటం, దినేశ్‌ కార్తీక్‌ మెరుపులతో లక్ష్యానికి దగ్గరగా రాగలిగాం. మెల్‌బోర్న్‌లో గెలవాలంటే మాత్రం ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విజృంభించాల్సిందే. కోహ్లి మూడో స్థానంలో రావడమే ఉత్తమం. జట్టులో చోటు నిలవాలంటే కేఎల్‌ రాహుల్‌ వైఫల్యాల నుంచి తక్షణమే బయటపడాలి. ఇంగ్లండ్‌ సిరీస్‌లో సెంచరీ అనంతరం గత ఆరు టి20ల్లో అతడు కనీసం 30 పరుగులు కూడా దాటలేదు.

ప్రతిభరీత్యా రాహుల్‌కు మరో అవకాశం దక్కొచ్చు. ఈ ఫార్మాట్‌లో తనపై భరోసా పెట్టుకోవచ్చని దినేశ్‌ కార్తీక్‌ మరోసారి చాటాడు. ఒత్తిడిలో ఎలా ఆడాలో కుర్ర రిషభ్‌ పంత్‌ నేర్చుకోవాలి. బ్రిస్బేన్‌లో ఘోరంగా విఫలమైనా... ఆల్‌ రౌండర్‌ హోదాలో కృనాల్‌ పాండ్యాను కొనసాగించే సూచన కనిపిస్తోంది. యువ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో లెగ్‌ స్పిన్నర్‌ చహల్‌ను తీసుకోనున్నారు. తొలి మ్యాచ్‌లో కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా చక్కగా బౌలింగ్‌ చేశారు. టి20ల్లో వీరిని ఎదుర్కొనడం ఏ జట్టుకైనా సవాలే. అలవాటైన మైదానాల్లో ఆస్ట్రేలియన్లు అలవోకగా భారీ షాట్లు కొడుతున్నందున బౌలింగ్‌ మరింత పకడ్బందీగా సాగాల్సిన అవసరం ఉంది.

ఆసీస్‌ అనూహ్యంగా...
బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం తర్వాత ఆసీస్‌ అన్ని ఫార్మాట్లలో 23 మ్యాచ్‌లాడి, కేవలం ఆరింట్లో గెలిచింది. అందులో మూడు జింబాబ్వే, యూఏఈలపై వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన బౌలర్లు లేకుండానే బరిలో దిగినా, భారత్‌పై టి20 నెగ్గడం జట్టులో నమ్మకాన్ని పెంచింది. బ్యాటింగ్‌లో మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, క్రిస్‌ లిన్‌లకు కెప్టెన్‌ ఫించ్, డియార్సీ షార్ట్‌ దూకుడు తోడైతే ఆ జట్టును ఆపడం కష్టం. భారీ మైదానాల్లో వీరి భుజ బలమే కీలకం కానుంది. ఆతిథ్య జట్టు  మార్పుల్లేకుండానే బరిలో దిగే వీలుంది. ఏదో పేరుకు మాత్రమే అన్నట్లు తీసుకున్న స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా మ్యాచ్‌ ఫలితాన్ని శాసించే ప్రదర్శన చేశాడు. పేసర్లు కూడా ప్రభావం చూపితే టీమిండియాపై వరుసగా రెండో గెలుపును అందుకుని సిరీస్‌ను ఇక్కడే ఎగరేసుకుపోదామని జట్టు ఆశిస్తోంది.

తుది జట్టు (అంచనా)
భారత్‌: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్‌), రాహుల్, దినేశ్‌ కార్తీక్, పంత్, కృనాల్, భువనేశ్వర్, కుల్దీప్, చహల్‌/ఖలీల్, బుమ్రా.
ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), షార్ట్, లిన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, బెన్‌ మెక్‌డెర్మట్, క్యారీ, టై, జంపా, బెహ్రెన్‌డార్ఫ్, స్టాన్‌లేక్‌.

పిచ్, వాతావరణం
ఎంసీజీలో డ్రాప్‌ ఇన్‌ పిచ్‌ను వాడనున్నారు. పెద్దగా బౌన్స్‌ ఉండకపోవచ్చు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే వీలుంది.   ఈ మైదానంలో భారత్, ఆసీస్‌ జట్ల మధ్య 3 టి20 మ్యాచ్‌లు జరిగాయి. రెండింటిలో భారత్‌ నెగ్గగా... మరో మ్యాచ్‌లో ఆసీస్‌ గెలిచింది.

మరిన్ని వార్తలు