నేడు మహిళల సింగిల్స్ ఫైనల్

8 Sep, 2013 02:50 IST|Sakshi
నేడు మహిళల సింగిల్స్ ఫైనల్

 సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో గత ఏడాది ఫైనల్ మ్యాచ్ ఈసారీ పునరావృతం కానుంది. వరుసగా రెండో ఏడాది టాప్ సీడ్ సెరెనా విలియమ్స్, రెండో సీడ్ విక్టోరియా అజరెంకా యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. కెరీర్‌లో 17వ సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై సెరెనా గురిపెట్టగా... గత ఏడాది సెరెనా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకొని తొలిసారి యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించాలని అజరెంకా పట్టుదలతో ఉంది.
 
 న్యూయార్క్: కొత్త చరిత్ర సృష్టించేందుకు సెరెనా విలియమ్స్ మరో విజయం దూరంలో నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కురాలిగా ఆమె గుర్తింపు పొందుతుంది.
 
 ఆదివారం జరిగే టైటిల్ పోరులో రెండో సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్)తో సెరెనా తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ సెరెనా 6-0, 6-3తో ఐదో సీడ్ నా లీ (చైనా)పై; అజరెంకా 6-4, 6-2తో ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)పై గెలిచారు. ముఖాముఖి రికార్డులో 31 ఏళ్ల సెరెనా 12-3తో 24 ఏళ్ల అజరెంకాపై ఆధిక్యంలో ఉంది. అయితే యూఎస్ ఓపెన్‌కు ముందు జరిగిన సిన్సినాటి మాస్టర్స్ టోర్నీలో సెరెనాపై అజరెంకా గెలిచింది.
 
 ఏకపక్షంగా
 ఈ సీజన్‌లో ఏకంగా ఎనిమిది టైటిల్స్ సాధించి భీకరమైన ఫామ్‌లో ఉన్న సెరెనా సొంతగడ్డపై ఎదురులేని ఆటతీరుతో దూసుకుపోతోంది. ఫైనల్ చేరే క్రమంలో ఈ నల్లకలువ ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. 1988లో 128 మంది క్రీడాకారిణులతో కూడిన ‘డ్రా’ మొదలైన తర్వాత మేరీ పియర్స్ (1994 ఫ్రెంచ్ ఓపెన్; 10 గేమ్‌లు),  స్టెఫీ గ్రాఫ్ (1988 యూఎస్ ఓపెన్; 13 గేమ్‌లు) అనంతరం తక్కువ గేమ్‌లు కోల్పోయి ఫైనల్‌కు చేరిన మూడో క్రీడాకారిణిగా సెరెనా నిలిచింది.
 
  ప్రస్తుత యూఎస్ ఓపెన్‌లో సెరెనా కేవలం 16 గేమ్‌లను మాత్రమే చేజార్చుకుంది. ఏడోసారి యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న సెరెనాకు సెమీస్‌లోనూ ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. తొలి సెట్‌లో నా లీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన ఈ డిఫెండింగ్ చాంపియన్‌కు రెండో సెట్‌లో కాస్త పోటీ ఎదురైంది. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన సెరెనా వెంటనే తేరుకొని నా లీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి 77 నిమిషాల్లో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
 
 పెనెట్టా జోరుకు బ్రేక్
 ముగ్గురు సీడెడ్ క్రీడాకారిణులను ఓడించి సెమీఫైనల్‌కు చేరిన అన్‌సీడెడ్ ఫ్లావియా పెనెట్టా జోరుకు అజరెంకా బ్రేక్ వేసింది. ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 18 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ అజరెంకా కీలకదశలో బ్రేక్ పాయింట్లు సాధించి మ్యాచ్‌ను వశం చేసుకుంది. తొలి సెట్‌లో ఈ ఇద్దరూ తడబడ్డారు.
 
  స్థిరమైన ఆటతీరును కనబర్చడంలో విఫలమయ్యారు. తొలి సెట్‌లోని తొలి పది గేముల్లో ఏకంగా ఏడు బ్రేక్ పాయింట్లు వచ్చాయి. అయితే 10 నిమిషాలపాటు జరిగిన పదో గేమ్‌లో అజరెంకా సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను 52 నిమిషాల్లో దక్కించుకుంది. రెండో సెట్‌లోనూ అజరెంకా తన ఆధిపత్యాన్ని చాటుకొని కెరీర్‌లో నాలుగోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో స్థానాన్ని సంపాదించింది.
 
 పురుషుల డబుల్స్ ఫైనల్
 పేస్, స్టెపానెక్    x పెయా, సోరెస్
 రాత్రి గం. 10.00 నుంచి
 
 మహిళల సింగిల్స్ ఫైనల్
 సెరెనా    x అజరెంకా
 అర్ధరాత్రి గం. 2.00 నుంచి
 
 టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు