ఆడతారా? అల్విదా చెబుతారా!

26 Mar, 2020 06:25 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా నేపథ్యంలో భారత స్టార్‌ క్రీడాకారుల కెరీర్‌కు బ్రేక్‌

అంతర్జాతీయ స్థాయిలో ఎన్ని గొప్ప విజయాలు సాధించినా ఒలింపిక్‌ పతకానికున్న విలువ మరే వాటికి ఉండదు. అలాంటిది ఇప్పటికే పతకం గెలిచి దేశానికి మరో పతకం అందించాలని, ఉజ్వలమైన కెరీర్‌కు విశ్వ క్రీడలతో ముగింపు చెప్పాలనుకునే క్రీడాకారులు కొందరు. భారత్‌ విషయానికొస్తే కొద్ది మంది మాత్రమే ఒలింపిక్స్‌లో మెరిపించారు. టెన్నిస్‌ స్టార్‌ లియాండర్‌ పేస్, బాక్సర్‌ మేరీకోమ్, రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ పతకాలు కూడా సాధించారు. కెరీర్‌ చరమాంకంలో ఉన్న వీరందరూ ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌లో ఆడి పతకంతో అల్విదా చెప్పాలని భావించారు. అయితే టోక్యో ఒలింపిక్స్‌ ఏడాదిపాటు వాయిదా పడటంతో ఈ మేటి క్రీడాకారులకు అవకాశం దక్కుతుందా లేదా వేచి చూడాలి.  

సాక్షి క్రీడా విభాగం
ఊహించని ఉత్పాతం కరోనా కారణంగా ఎన్నడూ లేని విధంగా విశ్వ క్రీడలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ మెగా ఈవెంట్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వాయిదా కొంత నిరాశ కలిగించినా... ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), జపాన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే సరైనది. అయితే ఈ వాయిదా నిర్ణయం పలువురు వెటరన్‌ క్రీడాకారుల కెరీర్‌కు అర్ధాంతరంగా ముగింపు పలికే అవకాశముంది. వారెవరంటే...

రాకెట్‌ దూసుకెళ్లేనా?
లియాండర్‌ పేస్‌... అంతర్జాతీయ వేదికపై భారత టెన్నిస్‌కు పర్యాయపదం. 30 ఏళ్లుగా టెన్నిస్‌లో కొనసాగుతున్నాడు. ఈ మూడు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించాడు. భారత్‌ పతాకాన్ని రెపరెపలాడించాడు. 1992 నుంచి 2016 దాకా వరుసగా ఏడు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న తొలి భారతీయ క్రీడాకారుడిగా, ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి టెన్నిస్‌ ప్లేయర్‌గా పేస్‌ గుర్తింపు పొందాడు. ఈ ఏడాదితో తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతానని... కోచ్‌గా మారి ప్రతిభావంతులైన చిన్నారులకు శిక్షణ ఇస్తానని 46 ఏళ్ల పేస్‌ ప్రకటించాడు. అదృష్టం కలిసొస్తే చివరిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతానన్న పేస్‌కు టోక్యో క్రీడలు ఏడాది వాయిదా పడటంతో వచ్చే ఏడాది ఆ అవకాశం ఉండకపోవచ్చు.

టోక్యో ఒలింపిక్స్‌లో ఆడాలంటే పేస్‌ తన రిటైర్మెంట్‌ను కూడా ఏడాదిపాటు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. కరోనా కారణంగా జూన్‌ వరకు అంతర్జాతీయ టెన్నిస్‌ జరిగే అవకాశం లేదు. ఇప్పటికే ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ వాయిదా పడింది. వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలైనా సజావుగా జరుగుతాయా అని చెప్పే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదే ఆటకు వీడ్కోలు పలకాలా లేక వచ్చే ఏడాది వరకు కొనసాగాలా అనే అంశాన్ని పేస్‌ తేల్చుకోవాలి. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన పేస్‌ 2004లో మహేశ్‌ భూపతితో కలిసి ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో డబుల్స్‌ విభాగంలో కాంస్య పతక పోరులో ఓడిపోయాడు.  

ఆఖరి పంచ్‌ పడిందా?
శతాబ్దం కంటే ఎక్కువ చరిత్ర కలిగిన ఒలింపిక్స్‌ క్రీడల్లో మహిళల బాక్సింగ్‌ను మాత్రం 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టారు. ఈ క్రీడల్లో భారత దిగ్గజ మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌ 51 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. అంతకుముందే మేరీకోమ్‌ అంతర్జాతీయ మహిళల బాక్సింగ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఏ భారతీయ బాక్సర్‌కు సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోయినా... పట్టు వదలకుండా పోరాడి టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ను దక్కించుకుంది.

కెరీర్‌ను మరో ఒలింపిక్‌ పతకంతో ముగించాలని ఆశించింది. అయితే టోక్యో విశ్వ క్రీడలు వాయిదా పడటంతో సంవత్సరంపాటు మేరీకోమ్‌ వేచి చూడక తప్పదు. ఇటీవల జోర్డాన్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా మేరీకోమ్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. వాయిదా నేపథ్యంలో అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం ప్రస్తుతం ఒలింపిక్స్‌కు అర్హత పొందిన వారిని అలాగే కొనసాగిస్తుందా లేక మళ్లీ మొదటినుంచి క్వాలిఫయిం గ్‌ను నిర్వహిస్తుందా స్పష్టత లేదు. దాంతో మేరీకోమ్‌ కెరీర్‌పై కూడా టోక్యో వాయిదా ప్రభావం చూపనుంది.

పట్టు చిక్కేనా?
భారత క్రీడల చరిత్రలో వ్యక్తిగత విభాగంలో రెండు ఒలింపిక్‌ పతకాలు గెలిచిన ఏకైక క్రీడాకారుడు, రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో 66 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గిన సుశీల్‌... 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో 66 కేజీల విభాగంలోనే రజత పతకం సాధించాడు. ఆ తర్వాత నాటకీయ పరిణామాల నడుమ 2016 రియో ఒలింపిక్స్‌కు దూరమైన సుశీల్‌... 2020 టోక్యో ఒలింపిక్స్‌ కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు. 74 కేజీల విభాగంలో పోటీపడాల్సిన సుశీల్‌ కీలక సమయంలో గాయం కారణంగా సెలెక్షన్‌ ట్రయల్స్‌కు దూరం కావడం... సుశీల్‌ స్థానంలో మరో రెజ్లర్‌ జితేందర్‌కు ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో పాల్గొనే అవకాశం లభించింది. టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడటంతో భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) సుశీల్‌కు మరో అవకాశం ఇస్తుందా లేక జితేందర్‌వైపు మొగ్గు చూపుతుందా వేచి చూడాలి. ఒకవేళ జితేందర్‌కే డబ్ల్యూఎఫ్‌ఐ ఓటు వేస్తే సుశీల్‌ కెరీర్‌ దాదాపు ముగిసినట్టే.   

మరిన్ని వార్తలు