డక్‌వర్త్‌  ‘లూయిస్‌’ కన్నుమూత

2 Apr, 2020 21:04 IST|Sakshi

లండన్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిని పరిచయం చేసిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ టోనీ లూయిస్‌(78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం బాధపడుతున్న లూయిస్‌ కన్నుమూసిన విషయాన్ని ఇంగ్లండ్‌-వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. ప్ర‌పంచ క్రికెట్‌లో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి గురించి అంద‌రికీ తెలిసిందే. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్‌లు ఆగిన‌ప్పుడు, తిరిగి లక్ష్యాన్ని నిర్దేశించ‌డానికి ఈ ప‌ద్థతిని వాడుతార‌న్న సంగ‌తి తెలిసిందే. 1997లో ఫ్రాంక్ డ‌క్‌వ‌ర్త్‌తో క‌లిసి టోనీ లూయిస్ ఈ ప‌ద్ధ‌తిని ప్ర‌తిపాదించారు.  దీనికి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) 1999లో ఆమోద ముద్ర వేయగా, దాన్ని 2004 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధానంగా వర్షం కురిసి మ్యాచ్‌లు సగంలో ఆగిపోతే అప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించి విజేతను ప్రకటించడం నేటికీ ఆనవాయితీగా వస్తుంది.

ప్ర‌స్తుతం దీన్ని డ‌క్‌వ‌ర్త్ లూయిస్ స్టెర్న్ ప‌ద్ధ‌తిగా పిలుస్తున్నారు. మ‌రోవైపు లూయిస్ మ‌ర‌ణంపై ఇంగ్లండ్‌ క్రికెట్ బోర్డు కూడా సంతాపం వ్య‌క్తం చేసింది. క్రికెట్‌కు ఆయ‌న ఎంత‌గానో సేవ చేశార‌ని అభిప్రాయ‌ప‌డింది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా సేవలందించిన లూయిస్‌.. ఆపై జర్నలిస్టుగా సేవలందించారు. 1990వ దశకంలో బీబీసీ టెలివిజన్‌ కామెంటేటర్‌గా ఆయన పనిచేశారు. ఇక క్రికెట్‌ లా మేకర్‌ అయిన మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ) అధ్యక్షుడిగా సైతం సేవలందించిన ఘనత టోనీ లూయిస్‌ది. 

మరిన్ని వార్తలు