టెన్నిస్‌లో బెట్టింగ్‌ కలకలం!

17 Dec, 2019 01:55 IST|Sakshi

బెర్లిన్‌: టెన్నిస్‌లో బెట్టింగ్‌ కలకలం చోటుచేసుకుంది. దాదాపు 135 మందికి పైగా ప్రొఫెషనల్‌ ఆటగాళ్లకు బెట్టింగ్‌లతో సంబంధం ఉందని... అందులో అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) టాప్‌–30 ర్యాంకింగ్‌ ఆటగాళ్లు ఉన్నారంటూ జర్మనీ మీడియా డై వెల్ట్, బ్రాడ్‌క్యాస్టర్‌ జీడీఎఫ్‌ బాంబు పేల్చింది. వీరు తొందర్లోనే అమెరికా దర్యాప్తు సంస్థ అయిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ), యూరోపియన్‌ అథారిటీస్‌లతో విచారణ ఎదుర్కోనున్నారని ఆ మీడియా సంస్థలు తెలిపాయి.

ఇందులో ఇప్పటి వరకు 3 ఏటీపీ టూర్‌ టైటిల్స్‌ నెగ్గిన టాప్‌–30 ర్యాంకు ఆటగాడు ఉన్నాడని సమాచారం. అర్మేనియా బెట్టింగ్‌ మాఫియాతో చేతులు కలిపిన కొందరు టెన్నిస్‌ ఆటగాళ్లు మ్యాచ్‌ ఫలితాలను తారుమారు చేస్తున్నారని బెల్జియం న్యాయవాది ఎరిక్‌ బిషప్‌ తెలిపారు. ఈ బెట్టింగ్‌ల ద్వారా కొన్ని వేల యూరోలు చేతులు మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఫిక్సింగ్‌ చేస్తూ దొరికిన అర్జెంటినా మాజీ టెన్నిస్‌ ఆటగాడు మార్కొ ట్రుంగెల్లిటి ఈ బెట్టింగ్‌ సమాచారం అందించినట్లుగా టెన్నిస్‌ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు