క్రికెట్‌ ఆస్ట్రేలియాకు మరో షాక్‌

29 Mar, 2018 11:31 IST|Sakshi

సిడ్నీ: స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, బాన్‌ క్రాఫ్ట్‌ల ట్యాంపరింగ్‌ ఉదంతంతో ఇప్పటికే పరువు పోగుట్టుకుని ప్రపంచం ముందు చిన్నబోయిన క్రికెట్‌ ఆస్ట్రేలియాకు మరో షాక్‌ తగిలింది. ఏడాది కాలంగా క్రికెట్‌ ఆస్ట్రేలియాకు అతిపెద్ద స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న మెగెల్లాన్‌ తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ మేరకు గురువారం క్రికెట్‌ ఆస్ట్రేలియాతో ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.  ఈ విషయాన్ని మగెల్లాన్‌ చీఫ్‌ హమీష్‌ డాగ్లస్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.ఇలా ఆకస్మికంగా తమ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం బాధగా ఉన్నప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కితగ్గాల్సి వచ్చిందన్నారు.

2017లో మెగెల్లాన్‌ భారీ మెత్తం (20 మిలియన్ల ఆసీస్‌ డాలర్లు) చెల్లించి  సీఏతో మూడేళ్లపాటు కొనసాగేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాది జరిగిన యాషెస్‌ సిరీస్‌తో ఒప్పందానికకి శ్రీకారం చుట్టిన మెగెల్లాన్‌.. అతి కొద్ది కాలంలోనే సీఏతో ఒప్పందానికి ముగింపు పలికింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్‌ జట్టు ట్యాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో వార్నర్‌, స్మిత్‌, బాన్‌ క్రాఫ్ట్‌లు అడ్డంగా దొరికిపోయి దోషులుగా నిలబడ్డారు. ఈ క‍్రమంలోనే స్మిత్‌, వార్నర్‌లపై ఏడాదిపాటు సీఏ నిషేధం విధించగా, బాన్‌ క్రాఫ్ట్‌పై 9 నెలల  నిషేధం పడింది. దాంతో పాటు కొన్ని కోట్ల ఒప్పందాల్ని వీరు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని వార్తలు