కోహ్లి వికెట్‌ తీస్తేనే మజా: బౌల్ట్‌

19 Feb, 2020 01:59 IST|Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవాలని చూస్తున్నాడు. ఈనెల 21న మొదలయ్యే తొలి టెస్టులో నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి వికెట్‌ తీస్తేనే అసలైన మజా ఉంటుందని చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ‘బాక్సింగ్‌ డే’ టెస్టులో బౌల్ట్‌ కుడి చేతికి గాయమైంది. దీంతో అతను ఆరు వారాల పాటు ఆటకు దూరమయ్యాడు. భారత్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో పాల్గొనలేకపోయాడు. ఇప్పుడు సంప్రదాయ క్రికెట్‌తో మళ్లీ తాజాగా బరిలోకి దిగబోతున్న బౌల్ట్‌ మీడియాతో మాట్లాడుతూ... ‘కోహ్లి అసాధారణ బ్యాట్స్‌మన్‌. తన గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు.

అతనెంతటి గొప్ప ఆటగాడో అందరికీ తెలుసు. అలాంటి మేటి బ్యాట్స్‌మన్‌ని అవుట్‌ చేయడం ద్వారా నా సత్తాను నేనే పరీక్షించుకుంటాను. అందుకే మ్యాచ్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను’ అని అన్నాడు. ఐదు రోజుల ఆట కోసం బాగా సన్నద్ధమయ్యానని చెప్పాడు. వెల్లింగ్టన్‌లో ఆడటం తనకెంతో ఇష్టమని అన్నాడు. భారత్‌ చేతిలో సొంతగడ్డపై టి20ల్లో క్లీన్‌స్వీప్‌ (0–5) కావడం బాధించిందని... అయితే తమ జట్టు వన్డే సిరీస్‌ను వైట్‌వాష్‌ చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుందని చెప్పాడు. 65 టెస్టులాడిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ 256 వికెట్లు తీశాడు.

మరిన్ని వార్తలు