నంబర్‌వన్‌గా ఎవరు?

16 Jan, 2015 09:10 IST|Sakshi
నంబర్‌వన్‌గా ఎవరు?

సిడ్నీ: ప్రపంచ కప్‌కు ముందు ఆసీస్ గడ్డపై అసలైన వన్డే సన్నాహకంగా పేర్కొంటున్న ముక్కోణపు వన్డే టోర్నీకి రంగం సిద్ధమైంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇందులో పాల్గొంటున్నాయి. టోర్నీలో ప్రతి జట్టు ఒక్కో ప్రత్యర్థితో రెండేసి సార్లు తలపడుతుంది. పాయింట్ల ఆధారంగా అగ్రస్థానంలో నిలిచిన రెండు టీమ్‌లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత్, ఆసీస్ ఇప్పుడు వన్డే మ్యాచ్‌ల బరిలోకి దిగబోతున్నాయి.

మరో వైపు ఈ టూర్‌కు ముందు శ్రీలంక చేతిలో చిత్తుగా వన్డే సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ కోలుకునేందుకు ముక్కోణపు సిరీస్ రూపంలో అవకాశం ముందుంది. కొత్త కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలో ఆ జట్టు మొదటి సారి బరిలోకి దిగుతోంది. శుక్రవారం ఇక్కడ జరిగే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడతాయి.

బుధవారం కాన్‌బెర్రాలో జరిగిన ప్రాక్టీస్ వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ 60 పరుగుల తేడాతో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌ను ఓడించింది. చాలా కాలంగా ఫామ్‌లో లేని ఆ జట్టు బ్యాట్స్‌మన్ ఇయాన్ బెల్ ఈ మ్యాచ్‌లో 145 బంతుల్లో 187 పరుగులు చేయడం విశేషం. ఆసీస్ ప్రపంచ కప్ జట్టులో సభ్యుడైన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా 89 బంతుల్లోనే 136 పరుగులు చేసి తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించాడు.
 
భారత్ ఒకే సారి
 ఆస్ట్రేలియా గడ్డపై ముక్కోణపు టోర్నీలలో భారత్ మొత్తం ఏడు సార్లు పాల్గొంది. 2007-08లో మాత్రం ఒకే ఒక్కసారి విజేతగా నిలిచింది. ఆ టోర్నీ బెస్టాఫ్ త్రీ ఫైనల్స్‌లో భారత్ వరుసగా మొదటి రెండు మ్యాచ్‌లు గెలుచుకొని టైటిల్ దక్కించుకోవడం విశేషం.

గత ముక్కోణపు టోర్నీ (2011-12)లో ఫైనల్‌కు అర్హత సాధించడంలో టీమిండియా విఫలమైంది. ఆసీస్‌తో పాటు శ్రీలంక పాల్గొన్న ఈ టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో భారత్ 3 గెలిచి, 4 ఓడింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ప్రస్తుత టోర్నీలో ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్... ఆస్ట్రేలియాను ఎదుర్కొంటుంది.
 
నంబర్‌వన్‌గా ఎవరు?

ప్రపంచకప్‌లోకి ఏ జట్టు నంబర్‌వన్‌గా అడుగుపెట్టనుందో అనే అంశంపై కూడా ఇప్పుడు పోటీ నెలకొంది. రేటింగ్ పాయింట్లలో సమానంగానే ఉన్నా దశాంశ స్థానాల కారణంగా ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్ ఐదో స్థానంలో ఉంది.

ముక్కోణపు టోర్నీ ప్రదర్శన ఈ ర్యాంకులను ప్రభావితం చేయవచ్చు. మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా, అటు సొంతగడ్డపై వెస్టిండీస్‌కు వన్డేల్లో సవాల్ విసురుతోంది. ప్రస్తుతం శ్రీలంకతో ఏడు వన్డేల సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్... ఆ తర్వాత పాకిస్థాన్‌తో ఆడే మరో రెండు వన్డేలతో తమ స్థానం మెరుగుపర్చుకునే ప్రయత్నంలో ఉంది.

ఆస్ట్రేలియా x ఇంగ్లండ్
శుక్రవారం ఉ. గం. 8.40 నుంచి
స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 

మరిన్ని వార్తలు