మంధాన బ్యాటింగ్‌ కాపీ చేశా...

24 Apr, 2020 15:27 IST|Sakshi
రియాన్‌ పరాగ్‌(ఫైల్‌ఫొటో)

కోహ్లి, రోహిత్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ కూడా ట్రై చేశా..

చివరగా నా బ్యాటింగ్‌నే ఫాలో అవుతున్నా..పరాగ్‌

న్యూఢిల్లీ:  గతేడాది జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున హైలైట్‌ అయిన ఆటగాడు రియాన్‌ పరాగ్‌. అస్సాంకు చెందిన రియాన్‌ పరాగ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయంలో కీలక పాత్ర పోషించి వార్తల్లో నిలిచాడు. 31 బంతుల్లో 47 పరుగులు సాధించి రాజస్తాన్‌ రాయల్స్‌ గెలుపునకు సహకరించాడు. దూకుడుగా ఆడే రియాన్‌ పరాగ్‌.. నిరుడు ఐపీఎల్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 130 స్టైక్‌రేట్‌తో 160 పరుగులు చేశాడు. ప్రధానంగా ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడే పరాగ్‌.. ఐపీఎల్‌లో ఆడటమే ఒక పెద్ద అదృష్టమని అంటున్నాడు.  (ఆడటం నీ డ్యూటీ.. మాట్లాడటం నా డ్యూటీ!)

గత సీజన్‌లోనే ఐపీఎల్‌లో అరంగేట్రం​ చేసిన పరాగ్‌.. తనకు చాలా మంది క్రీడాకారులు స్ఫూర్తి అని చెప్పుకొచ్చాడు. ‘ నేను ఎప్పుడైతే రాజస్తాన్‌ రాయల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నానో అప్పుడే నా కల నిజమైందని అనుకున్నాను. ఐపీఎల్‌ అనేది క్రికెట్‌ లీగ్‌ల్లో అతిపెద్ద లీగ్‌. అందులోనూ ఆరంభపు టైటిల్‌ సాధించిన రాజస్తాన​ జట్టులోకి రావడం ఇంకా సంతోషాన్ని ఇచ్చింది. నేను తొలిసారి బ్యాట్‌ పట్టుకుని క్రీజ్‌లోకి వచ్చినప్పుడు ఎంఎస్‌ ధోని నా వెనకాలే ఉన్నాడు. సీఎస్‌కేతో నా అరంగేట్రం మ్యాచ్‌ కావడంతో ధోనిని కీపర్‌గా దగ్గరగా చూశాను. ధోని, కోహ్లి, జోస్‌ బట్లర్‌, ఇలా పెద్ద పెద్ద వారితో ఆడటం చాలా హ్యాపీ అనిపించింది’ అని పరాగ్‌ తెలిపాడు. ఇక భయంలేని క్రికెట్‌ ఆడమని తనను ఎక్కువ ప్రోత్సహించింది బెన్‌ స్టోక్స్‌, స్టీవ్‌ స్మిత్‌లేనని పరాగ్‌ పేర్కొన్నాడు. తన సహజసిద్ధమైన ఆడమని సలహా ఇవ్వడంతో తాను ఫ్రీగా క్రికెట్‌ ఆడానన్నాడు. 

మంధానాను కాపీ చేశా..
తాను బ్యాటింగ్‌లో చాలా మందిని కాపీ చేశానని పరాగ్‌ చెప్పుకొచ్చాడు. అటు భారత మహిళా టాప్‌ క్రికెటర్ల దగ్గర్నుంచీ, పురుష టాప్‌ క్రికెటర్ల వరకూ చాలా మంది బ్యాటింగ్‌ను అనుకరించే యత్నం చేశానన్నాడు. ప్రధానంగా భారత మహిళా క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ స్మృతి మంధానా ఆటను కాపీ చేశానన్నాడు. కాగా, అది తనకు వర్కౌట్‌ కాలేదన్నాడు. అలానే పురుష క్రికెటర్లలో రోహిత్‌ శర్మను కూడా అనుకరించే యత్నం చేసినా సరైన ఫలితం రాలేదన్నాడు. కాకపోతే తాను     అండర్‌-19 వరల్డ్‌కప్‌లో ఆడినప్పుడు టీమిండియా ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆటను కాపీ చేశానన్నాడు. ఇది కాస్త లాభించిందన్నాడు. కాకపోతే ఇప్పుడు తన సొంత బ్యాటింగ్‌ శైలిపైనే దృష్టిపెట్టినట్లు పరాగ్‌ తెలిపాడు. (‘ఐపీఎల్‌ కోసం షెడ్యూల్‌ మార్చితే సహించం’)

మరిన్ని వార్తలు