రియోలో ముగ్గురమ్మాయిల ముచ్చట

6 Jun, 2016 18:59 IST|Sakshi
రియోలో ముగ్గురమ్మాయిల ముచ్చట

ఈసారి రియో ఒలింపిక్స్‌లో న్యాయనిర్ణేతలతో పాటు చూస్తున్న ప్రజలకు కూడా కాస్తంత గందరగోళం తప్పదు. ఎందుకంటే ముగ్గురు కవల అమ్మాయిలు మారథాన్‌లో పరుగులు తీయనున్నారు. ఈ ముగ్గురూ ఈస్టోనియా దేశానికి చెందినవారు. వీళ్లు గానీ టాప్ 5 స్థానాల్లో ఉన్నారంటే.. ఎవరు ఏ స్థానంలో వచ్చారో చెప్పడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు. వీళ్లలో వీళ్లు చెప్పాల్సిందే. అవును... ఎందుకంటే ఈ ముగ్గురూ చూడటానికి అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటారు. అందుకే వీళ్లను 'ట్రయో టు రియో' అంటున్నారు. వీళ్లు ముగ్గురూ ఒకేలాంటి యూనిఫాం కూడా వేసుకుంటారు. వీళ్ల పేర్లు లీలా, లిల్లీ, లీనా లుయిక్. చూసేవాళ్లకు తమలో ఎవరు ఎవరో గుర్తుపట్టడం అసాధ్యమని లిల్లీ చెప్పింది. తమలో ఒకరు ముందు, మరొకరు కాస్త వెనకాల కనిపిస్తే.. వెనక ఉన్నవాళ్లే ముందుకు వచ్చారనుకుని అప్పుడే వచ్చేశావా అని అనడం కూడా తనకు తెలుసని ఆమె తెలిపింది.

నెగ్గింది తానంటే తానని ఇంటర్వ్యూలు చేసేవాళ్లను కూడా ఈ అక్కచెల్లెళ్లు ఏడిపిస్తుంటారు. అసలు విజేత ఎవరో తెలియక, ఎవరిని అభినందించాలో, ఎవరి వద్ద మైకు పెట్టాలో అర్థం కాక తల బద్దలుకొట్టుకుంటారు. ఒలింపిక్స్‌లో కవలలు పాల్గొనడం కొత్త కాదు. కానీ, ఇలా ట్రిప్లెట్లు పాల్గొనడం, అది కూడా ఒకే ఈవెంటులో పాల్గొనడం మాత్రం ఇదే మొదటిసారని చెబుతున్నారు.

ఇక వీళ్ల కుటుంబానికి అథ్లెటిక్స్‌లో పాల్గొన్న చరిత్ర కూడా లేదు. చిన్నతనం నుంచి ఆటలంటే మాత్రం వీళ్లకు ఆసక్తి ఉండేది. అప్పటినుంచే ఎక్కువ దూరం పరుగులు తీసేవారు. అందులోనూ ఒకళ్లతో ఒకరు బాగా పోటీపడేవారు. ముగ్గురిలో ప్రస్తుతం లీలా ముందుంది. ఈమె అందరికంటే పెద్దది (కొన్ని నిమిషాలు!). ఎవరైనా వెనకబడుతుంటే ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ కమాన్.. ఆగొద్దు అని చెప్పుకొంటారట. అలాగే ముగ్గురిలో ఎవరికైనా గాయాలు అయినప్పుడు చాలా బాధపడతారు. తాము ముగ్గురం కలిసి పరుగులు తీయకపోతే ఏదోలా అనిపిస్తుందని లీలా చెప్పింది. ఈస్టోనియా నుంచి కేవలం ముగ్గురికి మాత్రమే ఒలింపిక్స్‌ మారథాన్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉండగా, ఈ ముగ్గురే దాన్ని దక్కించుకోవడం మరో విశేషం. అయితే వీళ్లలో ఎవరికీ పతకం వచ్చే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే, అందరికంటే అత్యుత్తమ సమయం 2 గంటల 37 నిమిషాల 11 సెకండ్లను లీలా నమోదుచేసింది. కానీ ఇది ఒలింపిక్స్ రికార్డు కంటే 15 నిమిషాలు ఎక్కువ. మారథాన్‌లో అంత సమయాన్ని కవర్ చేయడం అంటే అంత సులభం కాదు. చాలావరకు ఆఫ్రికన్ దేశాల క్రీడాకారులే మారథాన్‌ లాంటి ఈవెంట్లలో ముందుంటారు. అయినా తాము మాత్రం ఆశలు వదులుకునేది లేదని.. 'ట్రయో టు రియో' స్ఫూర్తిని కొనసాగిస్తామని ముగ్గురూ ముక్తకంఠంతో చెబుతున్నారు.

మరిన్ని వార్తలు