కిం కర్తవ్యం!

19 Jan, 2016 02:58 IST|Sakshi
కిం కర్తవ్యం!

తలనొప్పిగా మారిన బౌలర్లు
అయోమయంలో భారత జట్టు

 వరుసగా మూడు మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్ భారీస్కోర్లు చేసినా ఒక్కటి కూడా గెలవకపోవడం కచ్చితంగా ఏ జట్టునైనా నైరాశ్యంలోకి నెడుతుంది. భారత్ కూడా దీనికి అతీతం కాదు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాలోనే ఇంతకంటే ప్లాట్ వికెట్లపై ఎదురైన ప్రతి జట్టునూ ఆలౌట్ చేసిన భారత బౌలర్లు... ఈసారి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ఏ మాత్రం నిలువరించలేకపోతున్నారు. టి20 ప్రపంచకప్‌తో పాటు భవిష్యత్  గురించి ఆలోచిస్తే... ఒక్క ధోనికే కాదు, భారత సెలక్టర్లకు కూడా ఈ సిరీస్‌లో బౌలర్ల ప్రదర్శన ఓ పెద్ద తలనొప్పి.

 సాక్షి క్రీడావిభాగం  ‘మేం అదనంగా మరో 30 పరుగులు చేయడం... లేదా టాస్ గెలిచినా ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ ఇచ్చి ఛేజ్ చేయడం. ఈ రెండూ మినహా నా దగ్గర ప్రత్యామ్నాయం లేదు’... వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 300 పైచిలుకు స్కోర్లు చేసి ఓడిపోయిన తర్వాత ధోని నిర్వేదం ఇది. భారత బలహీనతను గమనించిన ఆస్ట్రేలియా మూడో వన్డేలో టాస్ గెలిచినా భారత్‌కు బ్యాటింగ్ ఇచ్చి మరోసారి లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది.

బౌలర్ల అనుభవలేమి తమ ఓటమికి ప్రధాన కారణంగా ధోని చెప్పుకొచ్చాడు. కానీ ఉమేశ్, ఇషాంత్ కలిసి 133 వన్డేలు ఆడారు. ఇషాంత్ ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇది నాలుగోసారి. ఇక ఉమేశ్ యాదవ్ మూడు ప్రధాన సిరీస్‌లు ఆడాడు. ఆస్ట్రేలియాలో పేసర్లకు ఎంతో కొంత సహకారం లభించే పిచ్‌లపై ఈ అనుభవం సరిపోదని అనుకోలేం. అశ్విన్ గత ఏడాది కాలంగా భారత జట్టు తరఫున అన్ని దేశాల్లోనూ నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సిరీస్‌లో మూడో వన్డే నాటికి అతను తుది జట్టులో స్థానమే కోల్పోయాడు. అశ్విన్ లాంటి అనుభవజ్ఞుడు ఏ పిచ్‌ల మీద అయినా రాణించాలి.

గతంలో కుంబ్లే, హర్భజన్‌లు ఇవే పిచ్‌ల మీద వికెట్లు తీసిన విషయం మరువ కూడదు. అదే సమయంలో అశ్విన్ కూడా ఇదే ఆస్ట్రేలియాలో ఏడాది క్రితమే స్ట్రయిక్ బౌలర్‌గా వికెట్లు తీసిన సంగతీ మరువలేం. నిజానికి అనుభవలేమి కంటే... క్రమశిక్షణ లేకపోవడం భారత బౌలర్ల ప్రధాన సమస్య.

 

షమీ లేకపోవడం లోటు
 ఈ సిరీస్ ఆరంభానికి ముందే భారత్‌కు షాక్ తగిలింది. గత ఏడాది ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన షమీ... అప్పటి నుంచి గాయం కారణంగా జట్టుకు అందుబాటులో లేడు. తాజాగా ఈ సిరీస్‌కు ముందు కోలుకుని జట్టులోకి వచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు తొలి మ్యాచ్‌కు ముందే ప్రాక్టీస్‌లోనే గాయపడ్డాడు.

ధోని చెప్పిన మాటలనే తీసుకుంటే షమీకి కూడా పెద్దగా అనుభవం లేదు. కానీ మంచి వేగంతో బంతుల్లో వైవిధ్యం చూపగల సత్తా ఉంది. ఉమేశ్ కూడా తన వేగంతో ప్రత్యర్థిని భయపెట్టాలి. కానీ లైన్ సరిగా లేక దెబ్బతిన్నాడు. కొత్త బ్యాట్స్‌మెన్ క్రీజులోకి రాగానే కాళ్ల మీదకు రెండు బంతులు వేసి రెండు బౌండరీలు ఇస్తే ఏ కెప్టెన్ కూడా ఏం చేయలేడు. ఫీల్డింగ్ సెట్ చేసిన విధానానికి అనుగుణంగా బంతులు వేయాలనే ప్రాథమిక అంశాన్ని భారత బౌలర్లు ఈ వన్డే సిరీస్‌లో మరచిపోయారు.

 టి20 ప్రపంచకప్‌లో పరిస్థితి?
 మరో రెండు నెలల్లో భారత్ స్వదేశంలో టి20 ప్రపంచకప్ ఆడబోతోంది. నిజానికి దీనిని దృష్టిలో ఉంచుకునే జట్టులో పలు మార్పులు చేశారు. యువ క్రికెటర్లను ఎంపిక చేశారు. ఇంకా ఆస్ట్రేలియాలో టి20లు ఆడకపోయినా... అందులో కూడా ఇంతకంటే భిన్నమైన ప్రదర్శనను ఆశించలేం. అయితే స్వదేశంలో భారత బౌలర్లు బాగా రాణిస్తారనేది ఒక అంచనా. అశ్విన్, జడేజా లాంటి స్పిన్నర్లు సొంతగడ్డపై కచ్చితంగా ప్రభావం చూపగలరు.

కానీ స్వదేశంలో అక్టోబరులో దక్షిణాఫ్రికాతో జరిగిన టి20ల ఫలితం తలచుకుంటే ఆందోళన పెరగడం ఖాయం. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ చిత్తుగా ఓడిపోయింది. ధర్మశాలలో 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి కూడా ఓడిపోయారు. భువనేశ్వర్, మోహిత్ శర్మ, అక్షర్, అశ్విన్... ఇలా భారత ప్రధాన బౌలర్లు, ఐపీఎల్‌లో చెలరేగిపోయే స్టార్స్ అంతా ఆ మ్యాచ్ ఆడారు. కానీ సఫారీలను నిలువరించలేకపోయారు. ప్రస్తుతం టి20 ఫార్మాట్‌లో అన్ని జట్లలోనూ భయంకరమైన హిట్టర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత సెలక్టర్లు ఆ మెగా టోర్నీకి జట్టు ఎంపికపై భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పేసర్లకు సహకరించే వికెట్లపై ప్రభావం చూపలేకపోయిన సీమర్లందరి విషయంలోనూ పునరాలోచన చేయాలేమో..!

 భవిష్యత్ గురించి ఆలోచన
 స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఓడిపోవడం, తాజాగా ఆస్ట్రేలియాలో ప్రదర్శన తర్వాత కచ్చితంగా భవిష్యత్‌కు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. బరిందర్ శరణ్ లాంటి యువ బౌలర్‌కు కెరీర్‌లో ఆడిన తొలి వన్డేలోనే మూడు వికెట్లు రావడం ద్వారా మంచి ఆరంభం లభించింది. కానీ ఆ ఆత్మవిశ్వాసం తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో అతను చూపించలేదు. అయినా వేగంగా బంతులు వేయగల ఇలాంటి క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వడం ద్వారా భవిష్యత్‌కు ఉపయోగపడేలా తయారు చేసుకోవాలి.

ఇదే సమయంలో దేశవాళీ క్రికెట్‌లో ఫ్లాట్ పిచ్‌లపై కూడా రాణిస్తున్న సీమర్లకు మెరుగైన అవకాశాలు ఇవ్వాలి. అంటే భారత్ ‘ఎ’ జట్టుకు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఏర్పాటు చేసి, రాహుల్ ద్రవిడ్ లాంటి అనుభవజ్ఞుడికి వీరిని సాన బెట్టేందుకు అప్పగించాలి. ఇప్పుడే కోలుకుని భవిష్యత్ గురించి ప్రణాళికలు రచించకపోతే... మనోళ్లు కేవలం ఐపీఎల్ స్టార్స్‌గా మాత్రమే మిగిలిపోతారు.
 

మరిన్ని వార్తలు