గంభీర్‌పై వేటు.. ఫ్యాన్స్‌ గుస్సా !

16 Nov, 2018 14:18 IST|Sakshi

10 మంది ఆటగాళ్లను వదులుకున్న ఢిల్లీ

న్యూఢిల్లీ : వచ్చే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు అప్పుడే ఫ్రాంఛైజీలు తమ కసరత్తులను ముమ్మరం చేసాయి. ఐపీఎల్-2019 కోసం తమ జట్టులోని ఆటగాళ్ల ప్రక్షాళనను మొదలెట్టాయి. అవసరం లేని ఆటగాళ్లను వదులుకుంటూ భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జట్టులో గుదిబండగా మారిన సీనియర్‌ ఆటగాళ్లను వదులుకోవడంలో కూడా ప్రాంఛైజీలు ఏ మాత్రం సంశయించడం లేదు. ఇప్పటికే కింగ్స్‌ పంజాబ్‌ యువరాజ్‌ను వదులుకోగా.. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌.. కెప్టెన్‌ గౌతం గంభీర్‌నే వదులుకుంటూ సంచలన నిర్ణయం తీసుకుంది.  గంభీర్‌తో సహా 10 మంది ఆటగాళ్లను రిలీజ్‌ చేసింది. ఈ జాబితాలో భారత ఆటగాళ్లు మహ్మద్‌ షమీ, సయాన్‌ గోష్‌, గురక్రిత్‌ సింగ్‌, నమాన్‌ ఓజా ఉండగా.. విదేశీ ఆటగాళ్లలో జాసన్‌ రాయ్‌, జూనియర్‌ డాలా, లియామ్‌ ప్లంకెట్‌, డానియల్‌ క్రిస్టియన్‌, గ్లేన్‌ మాక్స్‌వెల్‌లు ఉన్నారు. పంత్‌, అయ్యర్‌, పృథ్వీషాతో సహా 14 మందిని మాత్రమే ఢిల్లీ అట్టిపెట్టుకుంది.

ఇక గంభీర్‌ను వదులుకోవడంపై అభిమానులు ఢిల్లీ ఫ్రాంఛైజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్‌గా కోల్‌కతాకు రెండు సార్లు టైటిల్‌ అందించిన గంభీర్‌.. ఢిల్లీ కోసం వస్తే వదులుకుంటారా? అని మండిపడుతున్నారు. గంభీర్‌ లేని ఢిల్లీ  జన్మలో ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గదని శాపనార్ధాలు పెడుతున్నారు. ఇదో పిచ్చి నిర్ణయం అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు