టీమిండియా విలన్‌ ఉమేశ్‌ యాదవ్‌!

25 Feb, 2019 10:27 IST|Sakshi

సోషల్‌ మీడియాలో మండిపడుతున్న అభిమానులు

సాక్షి, విశాఖపట్నం ‌: టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌పై భారత అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఆదివారం విశాఖ సాగరతీరాన ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్‌ ఆఖరి బంతికి 3 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి ఉమేశ్‌ యాదవే కారణమని అభిమానులు మండిపడుతున్నారు. 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ విజయానికి చివరి ఓవర్లో 14 పరుగుల కావాలి. ఈ ఓవర్‌ను బౌలింగ్‌ చేసిన ఉమేశ్‌ యాదవ్‌.. అప్పటి వరకు బుమ్రా పడిన కష్టాన్ని బుగ్గిపాలు చేస్తూ పరుగులు సమర్పించుకున్నాడు. 14 పరుగులను అడ్డుకట్ట వేయలేక రెండు ఫోర్లు సమర్పించుకున్నాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా కమిన్స్‌ ఆ పనిని పూర్తి చేశాడు. ఇదే అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో ఉమేశ్‌పై విపరీతమైన ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు.

భారత ఓటమికి ఉమేశే కారణమని, టీ20ల్లో.. అది చివరి ఓవర్లలో ఎలా బౌలింగ్‌ చేయాలో కూడా తెలియదా? అంటూ మండిపడుతున్నారు. తమ ఎడిటింగ్‌ నైపుణ్యానికి పనిచెప్పి మరి ఫన్నీ మీమ్స్‌ ట్రెండ్‌ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ కేవలం 126 పరుగులు మాత్రమే చేసింది. భారత్‌ బ్యాట్స్‌మెన్‌లో రాహుల్‌ (36 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా... ధోని (37 బంతుల్లో 29 నాటౌట్‌; 1 సిక్స్‌), కోహ్లి (17 బంతుల్లో 24; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించినా మిగతా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం.. వేగంగా ఆడకపోవడం భారత విజయవకాశాలను దెబ్బతీసింది. స్వల్ప స్కోర్‌నే బుమ్రా నిలబెట్టే ప్రయత్నం ఆకట్టుకుంది. 4 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 16 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. తన బౌలింగ్‌తో ఆసీస్‌కు ముచ్చెమటలు పట్టించాడు.

మరిన్ని వార్తలు