ధోని వెన్ను నొప్పితోనే పంజాబ్‌ గట్టెక్కింది

16 Apr, 2018 17:08 IST|Sakshi
ధోనికి ఫిజియోథెరపీ చేస్తున్న ఫిజియో (ఫైల్‌ ఫొటో)

సోషల్‌ మీడియాలో అభిమానులు

ధోనిని ప్రశంసించిన క్రికెటర్లు 

మొహాలి : కింగ్స్‌పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని అద్భుత ఇన్నింగ్స్‌కు అంతా స్టన్‌ అయ్యారు. ఓ వైపు ధోనిని వెన్ను నొప్పి వెంటాడిన ఏ మాత్రం తగ్గకుండా రెచ్చిపోయాడు. తనదైన షాట్‌లతో బంతిని బౌండరీకి తరలిస్తూ చివరి క్షణం వరకు పోరాడాడు. అయితే చివరి ఓవర్‌ వేసిన పంజాబ్‌ బౌలర్‌ మోహిత్‌ శర్మ ధోని వెన్నునొప్పిని దృష్టిలో ఉంచుకొని ఆఫ్‌ వికెట్‌ మీదుగా బంతులను విసిరాడు. అయినా ధోని గెలుపే లక్ష్యంగా పోరాడాడు. చివరకు విజయానికి చేరువగా వచ్చిన చెన్నై 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ధోని వెన్ను నొప్పితోనే పంజాబ్‌ ఓటమిని తప్పించుకుందని సోషల్‌ మీడియాలో అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు.  ధోని ప్రదర్శనపై అటు అభిమానులు, మాజీ క్రికెటర్లు, ఇతర జట్ల ఆటగాళ్లంతా ఫిదా అయ్యారు. ట్విటర్‌ వేదికగా ధోనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఎంఎస్‌ ధోని అద్భుత ప్రదర్శన. అతని ఇంటర్వ్యూలను ఆస్వాదిస్తున్నాను. ఆ ఇంటర్వ్యూలో గాయాలైనప్పుడు కూడా నొప్పిని భరిస్తూ ఆడగలనని, దేవుడు నాకా శక్తి ఇచ్చాడని ధోని చెప్పిన మాట ఎంతగానో నచ్చింది. ఈ ఉత్కంఠకర మ్యాచ్‌లో పంజాబ్‌ నెగ్గడం సంతోషాన్నించింది.- మహ్మద్‌ కైఫ్‌

ధోని చేత ఓ గొప్ప ప్రదర్శన.. దాదాపు లక్ష్యాన్ని చేధించాడు. ఈ మ్యాచ్‌ చూస్తే 200 పరుగుల టార్గెట్‌ కూడా అంత భద్రం కాదనిపిస్తుంది. మీరేమంటారు? - రోహిత్‌ శర్మ

ధోనిభాయ్‌ నీవు చాంపియన్‌.. నీ ఇన్నింగ్స్‌ అద్భుతం-రషీద్‌ ఖాన్‌

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అని ధోని మరోసారి నిరూపించాడు. కింగ్స్‌పంజాబ్‌కు అభినందనలు- హర్భజన్‌ సింగ్‌

ఇక ధోని వెన్నునొప్పి తాళలేక ఇన్నింగ్స్‌ మధ్యలో ఫిజియోథెరపీ చేయించుకున్నాడు. రిటైర్డ్‌ హర్ట్‌ కావాలని ఫిజియో సూచించినా అతన్ని వెనక్కి పంపించి పోరాడాడు. మ్యాచ్‌ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘‘వెన్నునొప్పి నన్ను బాధించింది. ఫిజియో సాయంతో కాస్త ఉపశమనం పొందాను. మళ్లీ నొప్పి తిరగబెడుతుందా లేదా ఇప్పుడే చెప్పలేను. అయితే ఇవేవీ నాకు కొత్తేంకాదు. ఒక మోస్తారు గాయాలైనప్పుడు కూడా నొప్పిని భరిస్తూ ఆడగలను. దేవుడు నాకా శక్తి ఇచ్చాడు. పైగా తర్వాతి మ్యాచ్‌కు కొంత గ్యాప్‌ వచ్చింది కాబట్టి బహుశా పూర్తిగా కోలుకోవచ్చని ఆశిస్తున్నా’’ అని ధోనీ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ధోని 5 సిక్సులు, 6 ఫోర్లతో 44 బంతుల్లో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు