ఊతప్పదే సన్‌రైజర్స్‌ అవార్డు..!

6 May, 2019 18:41 IST|Sakshi

ముంబై: వాంఖేడి స్టేడియం వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఐపీఎల్ 12వ సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. నిజానికి ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధిస్తే వేరే జట్లతో పోటీ లేకుండా ప్లేఆఫ్స్‌‌కు అర్హత సాధించేది.అయితే, కోల్‌కతా ఓటమితో మెరుగైన రన్ రేట్‌ని కలిగి ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. కేవలం 12 పాయింట్లతోనే సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్‌కు అర్హత సాధించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇలా 12 పాయింట్లతో ఒక జట్టు ప్లేఆఫ్‌కు చేరడం ఐపీఎల్‌ చరిత్రలోనే తొలిసారి.

ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే మ్యాచ్ కావడంతో కోల్‌కతా ఎలా ఆడుతుందా? అని ప్రతి ఒక్క కేకేఆర్ అభిమాని ఎంతో ఆశగా ఎదురు చూశాడు. అయితే, కోల్‌కతా మాత్రం తన పేలవ ఆటతో ఆశ్చర్యపరిచింది. కనీస ప్రయత్నం కూడా చేయకుండా ఓడిపోయింది. ఈ సీజన్ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడిన కోల్‌కతా అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా రాబిన్ ఊతప్ప కారణంగానే కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడిపోయిందంటూ క్రికెట్‌ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ‘సన్‌రైజర్స్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు రాబిన్‌ ఊతప్పదే. అతను ఒంటిచేత్తో సన్‌రైజర్స్‌ను ప్లేఆఫ్‌కు చేర్చాడు’ అని ఒక అభిమాని సెటైర్‌ వేయగా, ‘వచ్చే సీజన్‌లో రాబిన్‌ ఊతప్పను కేకేఆర్‌ వదులు కోవడం ఖాయం. అదే సమయంలో ఆర్సీబీ అతన్ని తీసుకుంటుంది. వచ్చే సీజన్‌లో హోం జట్టుకు రాబిన్‌ ఆడతాడని ఆశిద్దాం’ అని మరొకరు ట్వీట్‌ చేశారు.

‘రాబీ చాలా నిర్లక్ష్యంగా బ్యాటింగ్‌ చేశాడు. అతను ఎప్పుడైతే బ్యాటింగ్‌కు దిగాడో అప్పుడు ప్రత్యర్థి జట్టుకు అనుకూలంగా మారిపోయింది’ అని మరొక అభిమాని విమర్శించాడు. ‘ ఇక రాబిన్‌ ఊతప్పకు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పే సమయం ఆసన్నమైందని, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని’ అభిమానులు మండిపడుతున్నారు. నిన్నటి మ్యాచ్‌లో రాబిన్‌ ఊతప్ప 47 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో ఫస్డ్‌ డౌన్‌ వచ్చిన ఆటగాడు స్టైక్‌ రోటేట్‌ చేయాలి. ఇది ఊతప్ప విషయంలో జరగలేదు. అసలు బంతిని బ్యాట్‌తో కనీసం టచ్‌ చేయడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వాంఖేడే స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా ఊతప్ప మాత్రం తన స్థాయికి తగ్గ ఆటను మాత్రం ఆడలేదనేది మ్యాచ్‌ చూసిన ఎవరికైనా అర్ధమవుతోంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు