వీవీఎస్‌ లక్ష్మణ్‌ చర్యపై సెటైర్లు..!

1 May, 2019 10:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారత క్రికెట్‌ దిగ్గజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ చర్యపై అభిమానులు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. పంటినొప్పితో బాధపడుతున్న లక్ష్మణ్‌ తన చిరకాల మిత్రుడు, డెంటిస్ట్‌ పార్థ సాల్వేకర్‌ వద్ద మంగళవారం చికిత్స చేయించుకున్నాడు. పాడైపోయిన దవడ పన్ను తీయించుకున్నాడు. అనంతరం.. ‘నొప్పి అనేది రెండు రకాలు. ఒకటి శారీరమైనది. రెండోది మానసికమైనది. కానీ, పంటి సమస్య ఈ రెండు సమస్యల్ని తట్టిలేపుతుంది’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఆస్పత్రిలో ఉన్న ఫొటోతోపాటు.. తొలగించిన పన్ను ఫొటో కూడా పోస్టు చేశాడు. 
(చదవండి :అంబుడ్స్‌మన్‌ ముందుకు సచిన్, లక్ష్మణ్‌! )

అయితే, అభిమానులు కొందరు లక్ష్మణ్‌ త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేయగా..  మరికొందరు మాత్రం.. యాక్‌ ఛీ..!  రక్తంతో కూడిన మీ పన్ను చూపిస్తున్నారేంటి అని చీదరించుకుంటున్నారు. ఈ ఫొటో అవసరమా అని కామెంట్‌ చేస్తున్నారు. మరొక అభిమాని.. ‘మీరు ఇలాగే మరిన్ని పళ్లు పీకించుకునేందుకు మీ ఫ్రెండ్‌ను తలచూ కలవాలి’ అని సెటైర్‌ వేశారు. ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందావంటూ నోటీసులు వచ్చాయి. కదా.. బీసీసీఐకి ఈ ఎర్రటి ‘పన్ను’ పంపించు. లెక్క సరిపోతుంది’ అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.

క్రికెట్‌ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ)లో సభ్యుడిగా, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మెంటార్‌గా  పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ వ్యక్తిగతంగా హాజరు కావాలని అంబుడ్స్‌మన్‌ సమన్లు పంపిన సంగతి తెలిసిందే. ‘సీఏసీ సభ్యులుగా మా బాధ్యతలేమిటి, పరిధేంటి, ఇంతకీ మా సభ్యుల పదవీ కాలమెంతో చెప్పాలని మేం గతేడాది డిసెంబర్‌ 7న సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌కి లేఖ రాశాం. అయితే ఇప్పటివరకు దీనిపై స్పందనే లేదు. కేవలం సీఏసీ అనేదొకటి ఉందని, అది పనిచేస్తుందిలే అనే విధంగానే వ్యవహారం నడుస్తోంది. దురదృష్టమేంటంటే అది ఎంతవరకు కొనసాగుతుందో ఎవరికీ తెలియదు’ అని అంబుడ్స్‌మన్‌కు లక్ష్మణ్‌ సంజాయిషీ లేఖ రాశాడు.

మరిన్ని వార్తలు