‘ఆ ఇద్దరే సిరీస్‌ స్వరూపాన్ని మార్చేశారు’

26 Jun, 2020 16:31 IST|Sakshi
2005 ద్వైపాక్షిక సిరీస్‌లో ట్రోఫీతో గంగూలీ-ఇంజమామ్‌(ఫైల్‌ఫొటో)

2004-05 సీజన్‌లో భారత్‌తో సిరీస్‌పై ఇంజమామ్‌

కరాచీ: 2004-05 సీజన్‌లో భారత్‌లో పర్యటించిన విశేషాలను పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమాముల్‌ హక్‌ మరోసారి గుర్తు చేసుకున్నాడు. అదొక ఒత్తిడితో కూడిన సిరీస్‌ కావడంతో భారత్‌లో వారిపై గెలవడం రెట్టింపు సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. అప్పటికే తమ గడ్డపై భారత్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోవడంతో విపరీతమైన ఒత్తిడితో అడుగుపెట్టినా అందుకు తగిన ఫలితమే లభించిందన్నాడు. తన యూట్యూబ్‌ చానల్‌లో ఆనాటి జ్ఞాపకాలను ఇంజీ గుర్తు చేసుకున్నాడు. ఆ ద్వైపాకిక్షిక సిరీస్‌లో టెస్టు సిరీస్‌ను సమం చేయడమే కాకుండా, వన్డే సిరీస్‌ను 4-2 తేడాతో గెలుచుకోవడం మరిచిపోలేని అనుభూతిగా పేర్కొన్నాడు.(233 ఏళ్ల ఎంసీసీ చరిత్రలో..)

‘తొలి టెస్టు డ్రాగా ముగిసింది. రెండో టెస్టులో గంగూలీ నేతృత్వంలోని భారత్‌ గెలిచింది. అయినా మేము పట్టువదల్లేదు. మూడో టెస్టులో అమీతుమీకి సిద్ధమయ్యాం. అది మేము గెలిచి సిరీస్‌ను సమం చేశాం. ఆ సిరీస్‌లో అబ్దుల్‌ రజాక్‌, కమ్రాన్‌ అక్మాల్‌లు మా తలరాతను మార్చారు. వారిద్దరి వల్లే మేము సిరీస్‌ను చేజార్చుకోలేదు. వారు సిరీస్‌ స్వరూపాన్నే మార్చేశారు.  జూనియర్‌ స్థాయి క్రికెటర్లే ఆడుతున్నప్పుడు మేము ఎందుకు ఆడలేకపోతున్నాం అనే ప్రశ్నను వారు లేవనెత్తారు. చండీగఢ్‌లో జరిగిన టెస్టులో కమ్రాన్‌ సెంచరీ చేయగా, రజాక్‌ 70 పరుగులకు పైగా చేశాడు. దాంతో మ్యాచ్‌ను కాపాడుకున్నాం. ఆ తర్వాత వన్డే సిరీస్‌లో తొలి రెండు వన్డేలను కోల్పోయి వెనుకబడ్డాం. అది ఆరు వన్డేల సిరీస్‌. ఆ తర్వాత వరుసగా నాలుగు వన్డేలు గెలిచి సిరీస్‌ను భారీ తేడాతో గెలిచాం. జూనియర్‌ స్థాయి క్రికెటర్లు ఆడుతున్నప్పుడు మేము ఎందుకు ఆడటం లేదు అని నాతో పాటు యూనిస్‌ ఖాన్‌, మహ్మద్‌ యూసఫ్‌ల్లో పట్టుదల వచ్చింది. దాంతోనే టీమిండియాపై చాలా కసిగా ఆడాం. ఏది ఏమైనా కమ్రాన్‌, రజాక్‌లే సిరీస్‌ స్వరూపాన్ని మార్చింది’ అని ఇంజీ పేర్కొన్నాడు. (టై అంటే టై.. సూపర్‌ ఓవర్‌ ఏమిటి?)

మరిన్ని వార్తలు