భారత బాక్సర్ల శుభారంభం

20 Apr, 2019 04:04 IST|Sakshi

ఆసియా చాంపియన్‌షిప్‌

బ్యాంకాక్‌: ప్రతిష్టాత్మక ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు శుభారంభం చేశారు. పోటీల తొలి రోజు శుక్రవారం బరిలోకి దిగిన ఐదుగురు బాక్సర్లు కూడా గెలుపొందడం విశేషం. పురుషుల విభాగంలో జాతీయ చాంపియన్‌ దీపక్‌ (49 కేజీలు), రోహిత్‌ టొకాస్‌ (64 కేజీలు), సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు), ఆశిష్‌ (69 కేజీలు)... మహిళల విభాగంలో సోనియా (57 కేజీలు) తొలి రౌండ్‌ బౌట్‌లలో నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు గెలిచిన భారత బాక్సర్లు సెప్టెంబరులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని భారత బాక్సింగ్‌ హై పెర్ఫార్మెన్స్‌ డైరెక్టర్‌ శాంటియాగో నీవా తెలిపారు.

తొలి రౌండ్‌ బౌట్‌లలో దీపక్‌ 5–0తో లోయ్‌ బుయ్‌ కాంగ్‌డాన్‌ (వియత్నాం)పై, రోహిత్‌ 5–0తో చు యెన్‌ లాయ్‌ (చైనీస్‌ తైపీ)పై, ఆశిష్‌ 5–0తో సోపోర్స్‌ (కంబోడియా)పై, సతీశ్‌ 5–0తో ఇమాన్‌ (ఇరాన్‌)పై నెగ్గగా... సోనియా 5–0తో డో నా యువాన్‌ (వియత్నాం)ను ఓడించింది. మొత్తం 34 దేశాల నుంచి పురుషుల విభాగంలో 198 మంది... మహిళల విభాగంలో 100 మంది బాక్సర్లు ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. ఈ టోర్నీ బౌట్‌లను స్లో మోషన్‌లో కూడా రికార్డు చేస్తున్నారు. ఫలితాలపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే బౌట్‌ ముగిసిన నిమిషంలోపు అప్పీల్‌ చేసుకోవాలి. ఒకవేళ వీడియో పరిశీలించిన తర్వాత అప్పీల్‌లో నిర్ణేతలు నిర్ణయం సరైనదేనని తేలితే మాత్రం అప్పీల్‌ చేసిన వారు వెయ్యి డాలర్లు పెనాల్టీగా చెల్లించాలి.

మరిన్ని వార్తలు