‘రెండంచెల’ టెస్టుల పద్ధతి లేనట్లే!

8 Sep, 2016 00:30 IST|Sakshi

మార్పుపై వెనక్కి తగ్గిన ఐసీసీ
బీసీసీఐ నిరాకరణే ప్రధాన కారణం 

 
దుబాయ్: టెస్టు క్రికెట్‌ను పెద్ద జట్లు, చిన్న జట్లుగా విభజిస్తూ భవిష్యత్తులో రెండంచెలుగా మ్యాచ్‌లు నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చేసిన ప్రతిపాదనకు బ్రేక్ పడింది. ఈ ఆలోచనను ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లు ఐసీసీ ప్రకటించింది. బుధవారం జరిగిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌‌స కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘రెండంచెల్లో టెస్టులు నిర్వహించాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఓటింగ్ నిర్వహించాల్సిన అవసరం కూడా కనిపించలేదు. దీనిపై మరింత చర్చ జరగాల్సి ఉంది‘ అని సమావేశంలో పాల్గొన్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు. నేరుగా దీని గురించి ప్రస్తావించకపోరుునా... 2019 వరకు మ్యాచ్‌ల ప్రసార హక్కులు ఇప్పటికే ఇచ్చేసిన కారణంగా ఎలాంటి మార్పులైనా ఆ తర్వాతే సాధ్యమవుతాయని పరోక్షంగా ఐసీసీ తమ పత్రికా ప్రకటనలో పేర్కొంది.


భారత్ ఒత్తిడి వల్లే...
టాప్-7 జట్లను ఒక గ్రూప్‌లో, తర్వాతి ఐదు జట్లను మరో గ్రూప్‌లో పెట్టి మున్ముందు టెస్టు సిరీస్‌లు నిర్వహించాలని ఐసీసీ భావించింది. టెస్టులకు ఆదరణ పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయ పడింది. అరుుతే మొత్తం పది శాశ్వత సభ్య బోర్డులలో బీసీసీఐతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వే బోర్డులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారుు. వెస్టిండీస్ బోర్డు కూడా ముందుగా అంగీకరించినా... తర్వాత భారత్‌కే మద్దతు పలికింది. అంతర్జాతీయ క్రికెటర్ల సంఘాల సమాఖ్య (ఫికా) ఓటింగ్‌లో 72 శాతం మంది ఆటగాళ్లు కూడా కొత్త విధానానికి మద్దతు పలికారు. అరుుతే ఇది క్రికెట్ అభివృద్ధికి విఘాతం కలిగిస్తుందని, ఆటను మరింతగా విస్తరించడం కష్టమవుతుందని బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.

తాజా పరిణామంపై బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘మా వాదనను అర్థం చేసుకున్న ఐసీసీకి కృతజ్ఞతలు. ప్రపంచంలోని అన్ని క్రికెట్ దేశాల ప్రయోజనాలను పరిరక్షించడంలో బీసీసీఐ ముందుంటుంది. టెస్టులకు మరింత ప్రాచుర్యం కల్పించడంలో మేం అన్ని విధాలా సహకరిస్తాం‘ అని ఠాకూర్ చెప్పారు.

మరిన్ని వార్తలు