మిల్స్ ధరపై పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు!

21 Feb, 2017 16:42 IST|Sakshi
మిల్స్ ధరపై పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు!

లండన్: గత కొంతకాలంగా విదేశీ ట్వంటీ  20 లీగ్లతో బిజీగా గడిపిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్..  ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10వ సీజన్ కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇంట్లోనే కుటుంబంతో గడుపుతున్న పీటర్సన్ టెస్టు క్రికెట్ కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా ఇంగ్లండ్ బౌలర్ తైమాల్ మిల్స్ ఐపీఎల్ ధరను ఉద్దేశిస్తూ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్  వేలంలో తైమాల్ మిల్స్ కు అత్యధిక ధర పలకడం టెస్టు క్రికెట్ కు ఒక చెంపపెట్టుగా అభివర్ణించాడు.

ప్రత్యేకంగా ట్వంటీ 20 లీగ్ల పట్ల అభిమానాన్ని చాటుకున్న పీటర్సన్.. టెస్టు క్రికెట్ ను బతికించే బాధ్యత ఐసీసీపైనే ఉందని పేర్కొన్నాడు. ' ఐపీఎల్లో మిల్స్ కు రూ.12 కోట్లు ధర పలకడం టెస్టు క్రికెట్ కు కచ్చితంగా చెంపపెట్టే. మా దేశ  ప్రస్తుత ఒక ట్వంటీ 20 స్పెషలిస్టు ఇక ధనిక క్రికెటర్ అయిపోయాడు. ఇక్కడ టెస్టు క్రికెట్ ఎంత అథమ స్థాయిలో ఉందో ఐపీఎల్ వేలాన్ని బట్టి అర్ధమవుతోంది. టెస్టు క్రికెట్ ను బతికించడానికి ఐసీసీ తొందరపడాలి. లేకపోతే టెస్టు క్రికెట్ మనకు దూరం కాక తప్పుదు. నేను చేసిన వ్యాఖ్యలు  ఏ ఒక్కర్నో కించపరిచేవి కావు. ఇక్కడ మిల్స్ ను నేను విమర్శించలేదు. అతను ట్వంటీ 20ల్లో మంచి బౌలర్. ఇంగ్లండ్ తరపున అతనెప్పుడో అరంగేట్రం చేయాల్సి ఉంది' అని పీటర్సన్ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు