సెమీస్‌లో యువ భారత్‌ 

3 Oct, 2018 00:54 IST|Sakshi

అండర్‌–19 ఆసియా కప్‌లో ‘హ్యాట్రిక్‌’ విజయం

రాణించిన యశస్వి, ఆయుశ్‌

సవర్‌ (బంగ్లాదేశ్‌): అండర్‌–19 ఆసియా కప్‌లో యువ భారత్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. అఫ్గానిస్తాన్‌తో మంగళవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో భారత్‌ 51 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్‌ గ్రూప్‌ ‘ఎ’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ అఫ్గానిస్తాన్‌ నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 45.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్‌ (93 బంతుల్లో 92; 13 ఫోర్లు, 1 సిక్స్‌), ఆయుశ్‌ బదోని (66 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్‌) అర్ధ సెంచరీలతో రాణించారు.

14 పరుగులకే 3 వికెట్లు్ల కోల్పోయిన యువ భారత్‌ను యశస్వి ఆదుకున్నాడు. సిమ్రన్‌ సింగ్‌(17)తో నాలుగో వికెట్‌కు 62 పరుగులు, ఆయుశ్‌ బదోనితో ఐదో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. అఫ్గాన్‌ బౌలర్లలో అజ్మతుల్లా, కైస్‌ అహ్మద్‌ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్‌ 45.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రియాజ్‌ హుస్సేన్‌ (92 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్‌), రహ్మానుల్లా గుర్బాజ్‌ (30 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్సర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. భారత బౌలర్లు సమష్టిగా రాణించారు. సిద్ధార్థ్‌ దేశాయ్‌ (4/37), హర్‌‡్ష త్యాగి (3/40), సమీర్‌ చౌదరి (2/18) ఆకట్టుకున్నారు. యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్‌; శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో శ్రీలంకతో అఫ్గానిస్తాన్‌ తలపడతాయి.    

మరిన్ని వార్తలు