గ్రూప్‌ టాపర్‌ యువ భారత్‌

25 Jan, 2020 04:47 IST|Sakshi

మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 44 పరుగులతో గెలుపు

బ్లూమ్‌ఫోంటీన్‌ (దక్షిణాఫ్రికా): అండర్‌–19 క్రికెట్‌ ప్రపంచ కప్‌లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత జట్టు 6 పాయింట్లతో గ్రూప్‌ ‘టాపర్‌’గా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 23 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 115 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో 21 ఓవర్ల అనంతరం వర్షం రావడంతో మ్యాచ్‌ 4 గంటలకుపైగా ఆగిపోయింది. వాన తగ్గాక అంపైర్లు మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు.

ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (57 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), దివ్యాన్ష్ సక్సేనా (52 నాటౌట్‌; 6 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం డక్‌వర్త్‌ లూయీస్‌ పద్దతి ద్వారా న్యూజిలాండ్‌కు 23 ఓవర్లలో 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఛేదనకు దిగిన కివీస్‌ జట్టు 21 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటై ఓడింది. భారత లెగ్‌ స్పిన్నర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రవి బిష్ణోయ్‌ (4/30)తో ప్రత్యర్థిని కట్టడి చేయగా... అతనికి అథర్వ అన్కోలేకర్‌ (3/28) చక్కటి సహకారం అందించాడు. జనవరి 28న జరిగే సూపర్‌ లీగ్‌ తొలి క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడుతుంది.  

మరిన్ని వార్తలు