జయహో... యు ముంబా

28 Jul, 2019 05:21 IST|Sakshi
పుణేరీ పల్టన్‌ ఆటగాడిని పట్టేసిన ముంబా ఆటగాళ్లు

పుణేరి పల్టన్‌పై 33–23తో గెలుపు

బెంగాల్‌ వారియర్స్‌పై జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ విజయం

ముంబై: మొదటి అర్ధభాగంలో పోటీ ఇచ్చిన పుణేరి పల్టన్‌ తర్వాత చేతులెత్తేయడంతో యు ముంబా విజయాన్ని పట్టేసింది. దీంతో ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌లో రెండు మరాఠా జట్ల పోరులో తొలి విజయం ముంబైని వరించింది. శనివారం ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ యు ముంబా 33–23తో పుణేరి పల్టన్‌పై గెలిచింది. అభిషేక్‌ సింగ్‌ 5 రైడ్‌ పాయింట్లతో ఆకట్టుకున్నాడు. యు ముంబా సారథి ఫజేల్‌ అత్రాచలి, రోహిత్, సురీందర్‌ సింగ్, సందీప్‌ నర్వాల్‌లు చెరో 4 పాయింట్లతో రాణించా రు. పుణేరి తరఫున సుర్జీత్‌ సింగ్‌ 6 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ గీతం ఆలపించాడు.  

నెమ్మదిగా మొదలై..
ఆరంభంలో రెండు జట్లు ఆచితూచి ఆడటంతో పాయింట్లు ఎక్కువగా రాలేదు. పుణే తరఫున తొలి కూతకు వెళ్లిన మంజీత్‌ రిక్తహస్తాలతో తిరిగొచ్చాడు. అనంతరం ముంబై తరఫున కూతకు వెళ్లిన లీ డాంగ్‌ జీన్‌ను పుణే పట్టేయడం అదే సమయంలో లీ బోనస్‌ లైన్‌ను దాటడంతో ఇరు జట్లు ఒకేసారి ఖాతా తెరిచాయి. 2–5తో యు ముంబా వెనుకంజలో ఉన్నప్పుడు ఫజేల్‌ అత్రాచలి మంజీత్‌ను సూపర్‌ టాకిల్‌ చేశాడు. ఆ వెంటనే అభిషేక్‌ ఒక రైడ్‌ పాయింట్‌ తీసుకురావడంతో స్కోరు 5–5తో సమమైంది. పుణే తరఫున సుర్జీత్‌ సింగ్‌ సూపర్‌ టాకిల్‌ చేయడం, ఆ వెంటనే రైడ్‌కు వెళ్లి సురీందర్‌ సింగ్, సందీప్‌ నర్వాల్‌లను ఔట్‌ చేసి పుణేని 9–8తో ఆధిక్యంలోకి తెచ్చాడు. అయితే ఈ దశలో ముంబై చకచకా మూడు పాయింట్లు సాధించి 11–9తో విరామానికి వెళ్లింది. రెండో అర్ధభాగం ఆరంభమైన కాసేపటికే యు ముంబా ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి 15–10తో దూసుకెళ్లింది. ఇదే అధిక్యాన్ని చివరి వరకు కొనసాగించిన ముంబై జట్టు విజేతగా నిలిచింది.

గట్టెక్కిన జైపూర్‌...
మరో మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 27–25తో బెంగాల్‌ వారియర్స్‌పై నెగ్గింది. చివరి మూడు నిమిషాల్లో తడబడిన బెంగాల్‌ మూల్యం చెల్లించుకుంది.  జైపూర్‌ డిఫెండర్‌ సందీప్‌ ధుల్‌ (8 టాకిల్‌ పాయింట్లు)తో బెంగాల్‌ను పట్టేశాడు. రైడర్‌ దీపక్‌ హుడా 6 పాయింట్లతో రాణించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్‌ ఢిల్లీతో హరియాణా స్టీలర్స్‌; యు ముంబాతో బెంగళూరు బుల్స్‌ తలపడతాయి.

మరిన్ని వార్తలు