జైపూర్‌కు ఝలక్

19 Jul, 2015 01:23 IST|Sakshi
జైపూర్‌కు ఝలక్

యు ముంబా 29-28తో విజయం
  ప్రొ కబడ్డీ లీగ్-2

 
 ముంబై: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) రెండో సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌కు ఝలక్ తగిలింది. గతేడాది ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఆడిన యు ముంబా జట్టు శుభారంభం చేసింది.
 
  శనివారం జరిగిన ఈ తొలి మ్యాచ్.. నువ్వా నేనా అనే రీతిలో సాగగా చివరకు ముంబా జట్టు 29-28 తేడాతో నెగ్గింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఒక్కో పాయింట్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు పోటీపడ్డారు. అయితే కీలక సమయాల్లో ముంబై పాయింట్లు సాధిస్తూ జైపూర్‌పై ఒత్తిడి పెంచింది. 9-5తో ఆధిక్యంలో ఉన్న ఓ దశలో ముంబై ఏమరుపాటుతో ప్రత్యర్థి దూకుడు పెంచి 10-10తో సమంగా నిలిచింది.
 
 అయితే వెంటనే పుంజుకుని 16-15తో ముంబై తొలి భాగం ముగించింది. ఇక మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 25-25తో రెండు జట్లు సమంగా నిలిచాయి. ఈ దశలో షబీర్ బాపు ముంబైకి కీలక పాయింట్ అందించాడు. 29-26తో వెనుకబడిన తరుణంలో చివరి నిమిషంలో జైపూర్ రెండు పాయింట్లు సాధించినా అప్పటికే ఆలస్యమై పోయింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 33-25 తేడాతో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గింది.
 
 అంతకుముందు లీగ్ ప్రారంభంలో బాలీ వుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కపిల్‌దేవ్, ఆమిర్‌ఖాన్, రిషీ కపూర్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, జాన్ అబ్రహం తదితరులు హాజరయ్యారు. మరోవైపు ముంబై, పుణేలలో జరిగే మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ ఆటగాళ్లను దూరంగా ఉంచాలని నిర్వాహకులు నిర్ణయించారు. ముంబైలో ఉగ్రవాద దాడులను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు ఆందోళన చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు