యశస్వి జైశ్వాల్‌ సెంచరీ; ఫైనల్లో టీమిండియా

4 Feb, 2020 19:43 IST|Sakshi

పాచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా) : అండర్‌ 19 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ విధించిన 173 పరుగుల విజయలక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. టీమిండియా 35.2 ఓవర్లలో 176 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో దాయాది జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది. భారత ఓపెనర్లు యశస్వి జైశ్వాల్‌105*పరుగులు(113 బంతులు, 8 ఫోర్లు, 4సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కగా, దివ్యాన్ష్ సక్సేనా 59*పరుగులు(99 బంతులు, 6 ఫోర్లు) అర్థ సెంచరీ చేయడంతో టీమిండియా మరో 14 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను చేజిక్కించుకొన్నారు. భారత ఓపెనర్లను ఎలా కట్టడి చేయాలో అర్థంకాక పాక్‌ బౌలర్లు తలలు పట్టుకున్నారు. కాగా గురువారం న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ల మధ్య జరగనున్న రెండో సెమీస్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో టీమిండియా తుది పోరుకు సిద్ధమవనుంది. కాగా అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరు ఫిబ్రవరి 9(ఆదివారం) ఇదే స్టేడియంలో జరగనుంది.

అంతకుముందు భారత బౌలర్ల దాటికి పాక్‌ జట్టు 43.1 ఓవరల్లో 172 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్‌ హైదర్‌ అలీ, కెప్టెన్‌ రోహైల్‌ నాజిర్‌లు అర్థ శతకాలతో రాణించడంతో పాక్‌ జట్టు ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. వీరిద్దరు తప్ప మిగతా బ్యాట్స్‌మెన్‌ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కాగా భారత బౌలర్లలో సుషాంత్‌ మిశ్రా 3 వికెట్లతో రాణించగా, రవి బిష్ణోయ్‌, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు, అంకోల్కెర్‌, యశస్వి జైశ్వాల్‌లు ఒక్కో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు