‘అల్ట్రామ్యాన్‌’ ప్రపంచ పోరుకు హైదరాబాదీ

25 Nov, 2017 01:02 IST|Sakshi

హైదరాబాద్‌: అమెరికాలోని హవాయి దీవుల్లో జరిగే అల్ట్రామ్యాన్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో.. భారత్‌ నుంచి తొలిసారిగా ట్రయాథ్లెట్‌ మన్మథ్‌ రెబ్బా పాల్గొననున్నాడు. ఈ చాంపియన్‌షిప్‌ నవంబర్‌ 24 నుంచి 26వరకు జరగనుంది. ఇప్పటికే వివిధ అంతర్జాతీయ ట్రయాథ్లాన్‌ (స్విమ్మింగ్, బైక్‌ రైడింగ్, మారథాన్‌) ఈవెంట్లలో పాల్గొన్న హైదరాబాద్‌కు చెందిన మన్మథ్‌కు అల్ట్రామ్యాన్‌ చాంపియన్‌షిప్‌ నిర్వాహకులనుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఏడాదికోసారి జరిగే ఈ ఈవెంట్‌లో కేవలం 40 మంది అథ్లెట్లు ఆహ్వానం మేరకే పాల్గొంటారు. అత్యంత కఠినమైన ఈ రేసులో మొదట 10 కిలోమీటర్ల పాటు పసిఫిక్‌ మహాసముద్రంలో తీవ్రమైన అలలకు పోటీపడుతూ ఈదాల్సి ఉంటుంది.

 అనంతరం 421కిలోమీటర్లపాటు 16వేల అడుగుల ఎత్తైన కొండలపై బైక్‌ రైడింగ్‌ చేయాలి. తర్వాత 84 కిలోమీటర్ల మేర వేడిగా ఉండే లావా క్షేత్రాల గుండా డబుల్‌ మారథాన్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ట్రయథ్లాన్‌ కమ్యూనిటీ గుర్తించిన అత్యంత ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌ ఇది. అల్ట్రామ్యాన్‌ పరుగును పూర్తిచేసిన రెండో భారతీయుడు మన్మథ్‌. 2013 నుంచి మియామీమ్యాన్‌ సహా దాదాపు 12 ప్రముఖ ట్రయాథ్లాన్‌ రేసులను ఈయన పూర్తిచేశాడు. అమెరికా ప్రెసిడెన్షియల్‌ వాలంటీర్‌ సర్వీస్‌ అవార్డు విజేత అయిన మన్మథ్‌.. ఐరన్‌మ్యాన్‌ ఆల్‌ వరల్డ్‌ అథ్లెట్‌ 2017గా నిలిచాడు.    

మరిన్ని వార్తలు