అక్మల్‌పై నో యాక్షన్‌!

15 Feb, 2020 12:52 IST|Sakshi

జరిమానా లేదు.. నిషేధమూ లేదు

క్షమించమన్నాడు.. వదిలేశారు

కరాచీ: పాకిస్తాన్‌ నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ) ట్రైనర్‌ను కొట్టినంత పని చేసిన ఆ దేశ వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ ఉమర్‌ అక్మల్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకుండానే ఆ వివాదాన్ని పీసీబీ ముగించేసింది. ఇటీవల నిర్వహించిన ఫిట్‌నెస్‌ టెస్టుల్లో భాగంగా ట్రైనర్‌తో అతిగా ప్రవర్తించిన ఉమర్‌ అక్మల్‌పై జరిమానాతో పాటు నిషేధం కూడా ఉంటుందని హరూన్‌ రషీద్‌ నేతృత్వంలోని ఎంక్వైరీ కమిటీ స్పష్టం చేసింది. అతన్ని తాత్కాలికంగా పాకిస్తాన్‌ దేశవాళీ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విచారణ తర్వాత హరూన్‌ పేర్కొన్నాడు. దీనిపై నివేదకను కూడా పీసీబీ అందజేశాడు. అయితే పీసీబీ మాత్రం​ పేరుకే కమిటీ వేసి విచారణ చేపట్టినా అతనిపై చర్యలకు ముందుడుగు వేయలేదు.

తన ప్రవర్తనపై క్షమాపణలు చెప్పడంతో అక్మల్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరొకసారి ఆ తప్పు చేయొద్దని హెచ్చరించి వదిలేసింది. దాంతో నిషేధం నుంచి అక్మల్‌ తప్పించుకున్నట్లయ్యింది. గతంలో మికీ ఆర్థర్‌ కోచ్‌గా ఉన్న సమయంలో కూడా అక్మల్‌ ప్రవర్తన పీసీబీకి తలనొప్పిగా ఉండేది.  పలుమార్లు కోచ్‌ను  విమర్శించడంతో పాటు ఫిట్‌నెస్‌ టెస్టును కూడా సీరియస్‌గా పట్టించుకునేవాడు కాదు. అయినప్పటికీ అతనిపై చర్యలు శూన్యం. 

కొన్ని రోజుల క్రితం నిర్వహించిన పలురకాల ఫిట్‌నెస్‌ టెస్టుల్లో విఫలం కావడంతో పాటు తనకు కొవ్వు ఉందంటావా అంటూ ట్రైనర్‌తో వాగ్వాదానికి దిగాడు. తనకు కొవ్వు ఎక్కడ ఉందో చూపించూ అంటూ అతిగా ప్రవర్తించాడు.  చొక్కా విప్పి మరీ బెదిరింపు చర్యలకు దిగాడు.  దీనిపై కోచ్‌ మిస్బావుల్‌ హక్‌-పీసీబీలకు సదరు ట్రైనర్‌ ఫిర్యాదు చేశాడు. దానిపై కమిటీ వేసిన పీసీబీ.. ఎటువంటి చర్యలు తీసుకోకుండానే చేతులు దులుపేసుకోవడం పాకిస్తాన్‌ క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

గతేడాది అక్టోబర్‌లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వికెట్‌ కీపర్‌ ఉమర్‌ అక్మల్‌ వరుసగా రెండు గోల్డెన్‌ డక్‌లతో విమర్శల పాలై జట్టుకు మరొకసారి దూరమయ్యాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా ఉన్న మిస్బావుల్‌ హక్‌.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ టెస్టులపై సీరియస్‌గా దృష్టిసారించాడు. జూనియర్‌, సీనియర్‌ స్థాయిలో క్రికెటర్లు ఏ ఫిట్‌నెస్‌ టెస్టులో విఫలమైనా అతన్ని పక్కకు పెట్టాలనే తలంపుతో ముందుకు వెళుతున్నాడు. ఇది కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు దేశవాళీ మ్యాచ్‌లకు కూడా వర్తింప చేస్తే ఫిట్‌నెస్‌ ప్రమాణాలు పెరుగుతాయనే  భావనలో ఉన్నాడు. ఈ క‍్రమంలోనే ఉమర్‌ అక్మల్‌కు ఫిట్‌నెస్‌ నిర్వహించగా ఫెయిల్‌ అయ్యాడు.

మరిన్ని వార్తలు