పాక్‌ క్రికెటర్‌ను చెడుగుడు ఆడేశారు!

17 Jul, 2017 12:01 IST|Sakshi



కొత్తకారు కొనుక్కుని దాని ముందు ఠీవిగా నిలబడి ఫొటో తీసుకుని దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే స్నేహితులు, సన్నిహితుల నుంచి అభినందనలు సందేశాలు వస్తుంటాయి. మరికొందరైతే జాగ్రత్త కారు నడపమని సలహాయిస్తారు. పాకిస్తాన్‌ క్రికెటర్‌ ఉమర్‌ అక్మల్‌కు మాత్రం నెటిజన్లు వ్యతిరేకంగా స్పందించారు. ఇటీవల జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌ విజేతగా నిలిచింది. దీంతో తమ ఆటగాళ్లకు పాకిస్తాన్‌ క్రికెట్‌(పీసీబీ) బోర్డు భారీ నజరానాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉమర్‌ అక్మల్‌ తన ట్విటర్‌ పేజీలో పోస్ట్‌ చేసిన ఫొటోపై నెటిజన్లు విమర్శలు ఎక్కుపెట్టారు. సిల్వర్‌ కలర్‌ బెంట్లే కారు ముందు నిలబడి దిగిన ఫొటోను అక్మల్‌ పోస్ట్‌ చేశాడు. ‘ఎంజాయింగ్‌ లండన్‌ ఆఫ్టర్‌ హార్డ్‌వర్క్‌’ అని ఫొటోకు క్యాప్షన్‌ కూడా పెట్టాడు. దీనిపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

నువ్వు హార్డ్‌ వర్క్‌ చేయడమా అంటూ ఒకరు ఎద్దేవా చేశారు. ‘ఖరీదైన బ్లెంటీ కారు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. వేరొకరి కారు ముందు ఫొటో తీసుకునివుంటావ’ని మరొకరు వ్యాఖ్యానించారు. పాక్‌ క్రికెట్‌ బోర్డు సెంట్రల్‌ కాంట్రాక్టు ఎందుకు కోల్పోయావో చెప్పగలవా అంటూ ప్రశ్నించారు.

పాక్‌ జట్టులో స్థానం కోల్పోయిన అక్మల్‌ ఖరీదైన కారు ఎలా కొన్నాడని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి చిల్లర పనులు మానేసి క్రికెట్‌పై దృష్టి పెట్టాలని మరొకరు సలహాయిచ్చారు. అభిమానుల నుంచి నెగెటివ్‌ కామెంట్లు పోటెత్తడటంతో అక్మల్‌ స్పందించాడు. తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయొద్దని వేడుకున్నాడు. ఫ్యాన్స్‌ అంటే తనకెంతో ప్రేమ ఉందని, వారి ఆదరాభిమానాలను మర్చిపోనని అన్నాడు.

మరిన్ని వార్తలు