ఆదిలోనే సఫారీలకు షాక్‌

21 Oct, 2019 13:18 IST|Sakshi

రాంచీ: టీమిండియా జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ మూడో రోజు ఆటలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌(1) విఫలమయ్యాడు. ఓవర్‌నైట్‌ ఆటగాడిగా సోమవారం తన ఇన్నింగ్స్‌ ఆరంభించిన డుప్లెసిస్‌ ఎంతో సేపు క్రీజ్‌లో నిలవలేదు. ఈ రోజు ఆటలో ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. డుప్లెసిస్‌ నిన్నటి ఆటతో కలుపుకుని తొమ్మిది బంతులు ఆడగా పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఆరో ఓవర్‌ ఐదో బంతికి డుప్లెసిస్‌ బౌల్డ్‌ అయ్యాడు. దాంతో సఫారీలు 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతున్నారు.

9/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను కొనసాగించడానికి డుప్లెసిస్‌-హమ్జాలు బ్యాటింగ్‌కు దిగారు. కాగా, ఈ రోజు ఆటలో ఉమేశ్‌ యాదవ్‌ వేసిన తొలి ఓవర్‌ నాలుగు బంతుల్ని హమ్జా ఆడగా, ఐదో బంతిని డుప్లెసిస్‌ ఎదుర్కొన్నాడు. కాకపోతే ఉమేశ్‌ బంతిని అంచనా వేయడంలో విఫలమైన డుప్లెసిస్‌ వికెట్‌ను సమర్పించుకున్నాడు.  15 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 438 పరుగుల వెనుకబడి ఉంది. రెండో రోజు ఆటలో డీన్‌ ఎల్గర్‌(0), డీకాక్‌(4)లు పెవిలియన్‌ చేరిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా కోల్పోయిన మూడు వికెట్లలో ఉమేశ్‌కు రెండు వికెట్లు లభించగా, షమీకి వికెట్‌ దక్కింది. (ఇక్కడ చదవండి:టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఉమేశ్‌ ఫాస్టెస్ట్‌ రికార్డులు)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా