'వెన్ను'లో వణుకు

25 Sep, 2019 03:39 IST|Sakshi

బుమ్రాకు వెన్ను గాయం

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరం

బంగ్లాదేశ్‌ సిరీస్‌కూ అనుమానమే!

అతడి స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌

టీమిండియాకు కొత్త సమస్య...! చూచాయగా ఓ హెచ్చరిక...! వైవిధ్యం, వేగం కలబోతతో నిప్పులు చెరుగుతూ స్థిరంగా రాణిస్తున్న జట్టు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్ను గాయానికి గురయ్యాడు. దేశం ఏదైనా, పిచ్‌ ఎలాంటిదైనా బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపుతూ క్రికెట్‌ మేధావుల నుంచి ప్రశంసలు పొందుతున్న అతడు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. పైకి చెప్పకున్నా బుమ్రా గాయం తీవ్రంగా పెద్దగానే కనిపిస్తోంది. నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌కూ కష్టమే అంటుండటమే దీనికి నిదర్శనం.

ఈ రెండూ జరగబోయేది స్వదేశంలోనే కాబట్టి ఇప్పటికిప్పుడు ఇది పెద్ద సమస్య కాకున్నా... వెన్నెముక మీద తీవ్ర భారం పడే క్లిష్టమైన బౌలింగ్‌ శైలి రీత్యా బుమ్రా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందిని ప్రత్యేక దృష్టితో చూడాల్సిందే. కెరీర్‌ ఉన్నత స్థితిలో ఉండగా చాలామంది పేసర్లు ఈ విధంగానే గాయాలకు గురై తర్వాత లయ తప్పారు. మరింత జాగ్రత్త పడకుంటే బుమ్రా విషయంలోనూ ఇలాగే జరిగే ప్రమాదం ఉంది. బహు పరాక్‌!  

న్యూఢిల్లీ: టీమిండియా నంబర్‌వన్‌ పేసర్‌ బుమ్రా ‘స్వదేశంలో తొలిసారి టెస్టు’ ఆడాలన్న స్వప్నం నెరవేర్చుకోవడానికి మరికొంత కాలం ఆగక తప్పడం లేదు. గతేడాది జనవరిలో దక్షిణాఫ్రికాపై అరంగేట్రం నుంచి ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లలో 12 టెస్టులాడిన ఈ పేసర్‌... అదే దక్షిణాఫ్రికాపై భారత్‌లో మొదటిసారి సుదీర్ఘ ఫార్మాట్‌ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలో అనూహ్యంగా వెన్ను గాయానికి గురయ్యాడు. వెన్నెముకలో స్వల్ప పగులు (స్ట్రెస్‌ ఫ్రాక్చర్‌)తో ఇబ్బంది పడుతున్న అతడిని సఫారీ సిరీస్‌ నుంచి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) తప్పించింది.

‘తనపై మరింత భారం పడకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. బుమ్రా జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాస శిబిరానికి వెళ్తాడు. అతడిని బోర్డు వైద్యుల బృందం పరీక్షిస్తుంది’ అని ఓ ప్రకటనలో తెలిపింది. ఆటగాళ్లకు తరచూ నిర్వహించే స్కానింగ్‌ ద్వారా బుమ్రా సమస్య గురించి తెలిసినట్లు చెప్పింది. ప్రత్యామ్నాయంగా ఉమేశ్‌ యాదవ్‌ను ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా సిరీస్‌కు తొలుత ఉమేశ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా బోర్డు ఎలెవెన్‌ జట్టులో చోటిచ్చారు.

గాయం పెద్దదే(నా)
గతంలో మరో పేసర్‌ భువనేశ్వర్, వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గాయాల విషయంలో దాగుడుమూతలు ఆడిన బీసీసీఐ...ఇప్పుడూ అదే తీరున వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. బుమ్రా దాదాపు రెండు నెలలు పోటీ క్రికెట్‌ ఆడలేని పరిస్థితి ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మాత్రమే పాల్గొనడని చెబుతోంది. బోర్డులోని అధికార వర్గాల మాట మాత్రం భిన్నంగా ఉంది. బుమ్రా నవంబరు నెలలో జరిగే మూడు టి20లు, రెండు టెస్టుల బంగ్లాదేశ్‌ సిరీస్‌కూ కష్టమేనని ఓ అధికారి పేర్కొన్నారు. ‘వైద్య నివేదికల ప్రకారం చూస్తే జస్‌ప్రీత్‌ ఏడు నుంచి ఎనిమిది వారాలు... అంటే నవంబరు వరకు ఆట కు దూరం కావొచ్చు. వాస్తవానికి ముందుగానే గుర్తించినందుకు రెండు నెలలతో సరిపోయింది. లేకుంటే కోలుకోవడానికి సుదీర్ఘ కాలం పట్టేది’ అని ఆ అధికారి స్పష్టం చేశారు. దీన్నిబట్టి ఆటగాళ్ల గాయాలపై బోర్డు మళ్లీ తప్పుదోవ పట్టిస్తోందని అర్ధమవుతోంది.

ఎంత జాగ్రత్త పడినా...
భారత్‌లో జరుగబోతున్న సిరీస్‌ కాబట్టి బుమ్రా దూరమవడం కోహ్లి సేనకు పెద్దగా ఇబ్బంది కాదు. కానీ, గాయం నేపథ్యాన్ని బట్టి చూస్తే ఆటగాడిగా బుమ్రాకు, అతడిపై ఆధారపడుతున్న జట్టుకు ఓ హెచ్చరికే. 20 నెలల కాలంలోనే ప్రపంచంలోనే ప్రమాదకర బౌలర్‌గా పేరు తెచ్చుకున్న ఈ పేసర్‌ 12 టెస్టుల్లో 62 వికెట్లు పడగొట్టి ఇప్పటికే అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయి చేరుకున్న భారతీయ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. పాల్గొన్న నాలుగు విదేశీ పర్యటనల్లోనూ ఒక ఇన్నింగ్స్‌లో ఐదేసి చొప్పున వికెట్లు తీసి ఔరా అనిపించాడు. గాయాల బెడద ఉండటంతో అతడిని టీమిండియా మేనేజ్‌మెంట్‌ అవసరమైన మేరకే ఆడిస్తూ జాగ్రత్త పడుతోంది.

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ నుంచి సాధ్యమైనంత విశ్రాంతి ఇస్తోంది. అయినా మరోసారి మైదానానికి దూరమై ప్రపంచ చాంపియన్‌íÙప్‌లో భాగమైన ఓ కీలక టెస్టు సిరీస్‌కు దూరం చేసింది. 2018లో ఐర్లాండ్‌తో టి20 సందర్భంగా బొటనవేలి గాయానికి గురైన బుమ్రా ఆ తర్వాత ఇంగ్లండ్‌తో రెండు టెస్టులకు అందుబాటులో లేకుండా పోయాడు. అంటే అటుఇటుగా ఏడాదిలో రెండుసార్లు గాయానికి గురైన అతడు నవంబరు నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌ వరకు జట్టుకు సేవలందించలేడు.

>
మరిన్ని వార్తలు