వైరల్‌: వర్షాన్ని లెక్కచేయని అంపైర్‌

26 Oct, 2018 15:49 IST|Sakshi
జోరువానలో పాకిస్తాన్‌ అంపైర్‌ అలీం దార్‌

కొలంబో : ఇంగ్లండ్‌-శ్రీలంక మధ్య జరిగిన ఐదో వన్డేలో పాకిస్తాన్‌ అంపైర్‌ అలీం దార్‌ ప్రవర్తించిన తీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 27వ ఓవర్‌లో చోటు చేసుకున్న ఘటనపై యావత్‌ క్రికెట్‌ ప్రేమికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. అంపైర్‌ అలీంను కొనియాడుతున్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక ఆతిథ్య జట్టుకు 367 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఈ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్‌ ఆది నుంచి తడబడుతూనే ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. ఇక ధనుంజయ వేసిన 27వ ఓవర్‌లో ఇంగ్లండ్‌ ఆటగాడు లియామ్‌ ప్లంకెట్‌ వికెట్లు ముందు దొరికిపోయాడు.

అంపైర్‌ అలీందార్‌ వెంటనే ఔటిచ్చాడు. కానీ ఈ నిర్ణయానికి సంతృప్తి చెందని ప్లంకెట్‌ సమీక్ష కోరాడు. ఇంతలో వానందుకుంది. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానం వీడటానికి పరుగుపెడుతున్నారు. కానీ అంపైర్‌ అలీందార్‌ మాత్రం థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం కోసం జోరువానలోనే నిలబడి ఎదురు చూశాడు.. నిర్ణయం ప్రకటించిన తరువాతే మైదానం వీడాడు. దీంతో అలీందార్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అతని వృత్తిపై తనకున్న నిబద్దత అలాంటిదని హ్యాట్సాఫ్‌ అలీం.. అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌ గత మంగళవారం జరిగినప్పటికి దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌ చేస్తోంది. ఐదు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ 3-1తో సిరీస్‌ దక్కించుకున్పప్పటికీ.. ఈ మ్యాచ్‌తో వన్డే క్రికెట్ చరిత్రలోనే భారీ ఓటమిని మూటగట్టుకుంది. 219 పరుగుల భారీ తేడాతో (డక్‌వర్త్ లూయిస్) ఓటమిపాలైంది.

మరిన్ని వార్తలు