ఫీల్డర్‌ విసిరిన బంతి తగిలి అంపైర్‌ విలవిల

10 Mar, 2020 18:35 IST|Sakshi

రాజ్‌కోట్‌: రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర-బెంగాల్‌ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో ఫీల్డ్‌ అంపైర్‌ షంషుద్దీన్‌ తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం తొలి రోజు ఆటలో స్వ్కేర్‌ లెగ్‌ అంపైర్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్న సమయంలో బెంగాల్‌ ఫీల్డర్‌ విసిరిన బంతి నేరుగా వచ్చి  షంషుద్దీన్‌ ఉదర భాగంలో బలంగా తాకింది. దాంతో విల్లవిల్లాడిపోయిన అంపైర్‌ ఫీల్డ్‌లోనే కుప్పకూలిపోయాడు. సౌరాష్ట్ర వికెట్‌ కోల్పోయిన తర్వాత బెంగాల్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకునే క్రమంలో ఓ ఫీల్డర్‌ బంతిని అంపైర్‌ వైపు గట్టిగా త్రో విసిరాడు.(జడేజాకు బీసీసీఐ నో పర్మిషన్‌..!)

అది కాస్తా వెళ్లి అంపైర్‌కు తగిలింది. ఆ ఊహించని పరిణామంతో గాయపడ్డ అంపైర్‌ ఫీల్డ్‌లో నిలబడలేకపోయాడు. దాంతో అతను ఫీల్డ్‌ను వదిలి వెళ్లిపోయాడు. అతని స్థానంలో టీవీ అంపైర్‌గా వ్యవహరిస్తున్న ఎస్‌ రవి..తొలి రోజు ఆట ఫీల్డ్‌ అంపైర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. కాగా, అదే సమయంలో షంషుద్దీన్‌ టీవీ అంపైర్‌గా చేశాడు. కాగా, ఈ రోజు ఆటలో స్థానిక అంపైర్‌ పీయూష్‌ కక్కర్‌ స్వ్కేర్‌ లెగ్‌ అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. అయితే బుధవారం మూడో రోజు ఆటలో షంషుద్దీన్‌ స్థానంలో యశ్వంత్‌ బద్రి ఫీల్డ్‌ అంపైర్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అంపైర్‌ షంషుద్దీన్‌ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారం రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దాంతో రంజీ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ నుంచి షంషుద్దీన్‌ వైదొలిగాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 8 వికెట్లు కోల్పోయి 384 పరుగులు చేసింది.అర్పిత్‌ వసవాడా(106) సెంచరీ చేయగా, చతేశ్వర్‌ పుజారా(66), బరోత్‌(54), విశ్వరాజ్‌ జడేజా(54)లు హాఫ్‌ సెంచరీలు సాధించారు.(21 ఏళ్ల రికార్డు బ్రేక్‌ చేశాడు..)

మరిన్ని వార్తలు