కోహ్లితో వాగ్వాదం..డోర్‌ను ధ్వంసం చేసిన అంపైర్‌!

7 May, 2019 16:51 IST|Sakshi

బెంగళూరు:  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో వాగ్వాదానికి దిగిన ఇంగ్లిష్‌ అంపైర్‌ నిగెల్‌ లాంగ్‌  భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)విచారణను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక నోబాల్‌ వ్యవహారంలో కోహ్లితో వాగ్వాదానికి దిగిన తర్వాత స్టేడియంలోని ఓ గది తలుపును నిగెల్‌ ధ్వంసం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శనివారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్‌ ఉమేశ్‌యాదవ్‌ వేసిన ఓ బంతిని నిగెల్‌ నోబాల్‌గా ప్రకటించాడు. అయితే రీప్లేలో అది సరైన బంతిగా తేలడంతో కోహ్లికి, అంపైర్‌కి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సహనం కోల్పోయిన నిగేల్‌ ఇన్నింగ్స్‌ విరామం సమయంలో అంపైర్‌ గది తలుపును పగలగొట్టాడు. ఈ ఘటనపై అంపైర్‌ విచారణ ఎదుర్కోవాల్సి ఉందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. అయితే ఈ కారణంగా మే 12న జరిగే ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అంపైరింగ్‌ బాధ్యతల నుంచి అతడిని బీసీసీఐ తొలగించకపోవచ్చని సమాచారం. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న నిగెల్‌ లాంగ్‌.. మే 30 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో కూడా అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

మరిన్ని వార్తలు