‘ఆసియా’ గెలిచాం

5 Jan, 2014 00:42 IST|Sakshi
భారత అండర్-19 జట్టు

స్థాయి ఏదైనా భారత యువ క్రికెటర్లు అద్బుత ప్రదర్శనతో దూసుకుపోతూ భవిష్యత్‌పై ఎలాంటి బెంగా వద్దంటూ భరోసా ఇస్తున్నారు. తాజాగా భారత యువ జట్టు (అండర్-19) ఆసియా కప్ గెలిచింది. రెండేళ్లక్రితం ఇదే టోర్నీలో పాకిస్థాన్‌తో ఫైనల్‌ను టై చేసుకుని సంయుక్త విజేతగా నిలిచిన భారత్... ఈ సారి మాత్రం స్ఫూర్తిదాయక ఆటతీరుతో దాయాదిని చిత్తు చేసి సింగిల్‌గా టైటిల్ గెలిచింది. త్వరలో జరగనున్న అండర్-19 ప్రపంచకప్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.
 
 షార్జా: సీనియర్లకు సాధ్యం కానిది కుర్రాళ్లు చేసి చూపించారు...అవును, షార్జా మైదానంలో భారత సీనియర్ జట్టు నాలుగు ఫైనల్స్‌లో పాకిస్థాన్‌తో తలపడగా, ఒక్క సారి కూడా గెలుపు రుచి చూడలేకపోయింది. కానీ అండర్-19 జట్టు పాక్‌ను  ఓడించి ఆసియా కప్ టైటిల్ నెగ్గింది.  శనివారం ఇక్కడి షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత అండర్-19 జట్టు 40 పరుగుల తేడాతో పాకిస్థాన్ అండర్-19 టీమ్‌పై విజయం సాధించింది. అండర్-19 స్థాయిలో ఇది ఏడో ఆసియా కప్ కాగా, భారత్ విజేతగా నిలవడం రెండో సారి. 2012లో భారత్, పాక్ సంయుక్త విజేతలుగా నిలవగా... భారత్ సింగిల్‌గా టైటిల్ గెలవడం ఇదే తొలిసారి.
 
 శనివారం జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (87 బంతుల్లో 100; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ విజయ్ జోల్ (120 బంతుల్లో 100; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 180 పరుగులు జోడించడం విశేషం. అనంతరం పాకిస్థాన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 274 పరుగులు మాత్రమే చేయగలిగింది. కమ్రాన్ గులామ్ (89 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు) సెంచరీతో పోరాడినా లాభం లేకపోయింది. కెప్టెన్ సమీ అస్లామ్ (96 బంతుల్లో 87; 10 ఫోర్లు) కూడా రాణించారు. హైదరాబాద్ బౌలర్ సీవీ మిలింద్, దీపక్ హుడా చెరో 2 వికెట్లు పడగొట్టారు.
 
 భారీ భాగస్వామ్యం...
 టాస్ గెలిచి పాక్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్ హేర్వాడ్కర్ (12) తొందరగానే అవుటైనా, అంకుశ్ బైన్స్ (34 బంతుల్లో 47; 7 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. ఆ తర్వాత జోల్, సామ్సన్ కలిసి నిలకడగా ఆడారు. జోల్ జాగ్రత్తగా ఆడగా... సామ్సన్ భారీ షాట్లతో చెలరేగాడు. ముఖ్యంగా కరామత్  బౌలింగ్‌లోనే అతను మూడు సిక్సర్లు కొట్టగా, జోల్ మరో సిక్స్ బాదాడు. ఈ క్రమంలో 118 బంతుల్లో జోల్, 86 బంతుల్లో సామ్సన్ శతకాలు పూర్తి చేసుకున్నారు. అయితే తక్కువ వ్యవధిలోనే వీరిద్దరు వెనుదిరిగారు. తర్వాతి బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో భారత్ 28 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయింది.
 
 కమ్రాన్ సెంచరీ...
 ఓపెనర్ ఉమర్ (17)ను ఆరంభంలోనే అవుట్ చేసి మిలింద్ భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. గత రెండు మ్యాచుల్లో సెంచరీ, అర్ధ సెంచరీ సాధించిన  పాక్ కెప్టెన్ సమీ అస్లమ్ తన జోరును కొనసాగించాడు. 11 పరుగుల తేడాతో పాక్ 3 వికెట్లు కోల్పోయిన దశలో కమ్రాన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 93 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నాడు. అయితే సమీని ఆమిర్ గనీ అవుట్ చేయడంతో మ్యాచ్‌పై భారత్‌కు పట్టు చిక్కింది. ఒంటరి పోరాటం చేసిన కమ్రాన్ 88 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నా జట్టును గెలుపు దిశగా తీసుకు వెళ్లలేకపోయాడు.
 
 స్కోరు వివరాలు:
 భారత్ అండర్-19 ఇన్నింగ్స్: బైన్స్ (స్టంప్డ్) సైఫుల్లా (బి) కరామత్ 47; హేర్వాడ్కర్ (సి) ఉమేర్ (బి) జియావుల్ హఖ్ 12; జోల్ (సి) జఫర్ (బి) కరామత్ 100; సామ్సన్ (సి) ఉమేర్ (బి) జఫర్ 100; సర్ఫరాజ్ (రనౌట్) 5; హుడా (సి) సబ్-నిసార్ (బి) 13; భుయ్ (సి) సబ్-నిసార్ (బి) జఫర్ 6; గనీ (సి) జఫర్ (బి) జియావుల్ హఖ్ 5; కుల్దీప్ (నాటౌట్) 2; అవేశ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 314.
 
 వికెట్ల పతనం: 1-65; 2-85; 3-265; 4-286; 5-286; 6-297; 7-309; 8-311.
 బౌలింగ్: జియావుల్ హఖ్ 10-0-56-2; సల్మాన్ 5.5-0-49-0; జఫర్ 10-0-52-2; కరామత్ అలీ 10-0-78-2; కమ్రాన్ గులామ్ 10-0-46-1; ఉమేర్ 4-0-29-0; ఇమాముల్ హఖ్ 0.1-0-0-0.
 
 పాకిస్థాన్ అండర్-19 ఇన్నింగ్స్: సమీ అస్లమ్ (సి) అండ్ (బి) గనీ 87; ఉమేర్ (సి) అండ్ (బి) మిలింద్ 17; ఇమాముల్ హఖ్ (సి) ఖాన్ (బి) కుల్దీప్ 18; హసన్ రజా (స్టంప్డ్) బైన్స్ (బి) గనీ 1; సైఫుల్లా (ఎల్బీ) (బి) కుల్దీప్ 3; కమ్రాన్ (నాటౌట్) 102; షకీల్ (సి) హేర్వాడ్కర్ (బి) కుల్దీప్ 8; జఫర్ (బి) మిలింద్ 18; కరామత్ (సి) ఖాన్ (బి) హుడా 2; జియావుల్ హఖ్ (సి) గనీ (బి) హుడా 5; సల్మాన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 274.
 
 వికెట్ల పతనం: 1-39; 2-77; 3-84; 4-88; 5-181; 6-211; 7-246; 8-249; 9-269.
 బౌలింగ్: మిలింద్ 10-0-44-2; అవేశ్ ఖాన్ 10-1-55-0; హుడా 10-0-37-2; కుల్దీప్ 10-0-72-3; గనీ 7-0-39-2; సర్ఫరాజ్ ఖాన్ 3-0-24-0.
 
 
 ఈ విజయంలో మనోళ్లకూ భాగం
 ఆసియా కప్ గెలిచిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు కుర్రాళ్లు తమ ఆటతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ లెఫ్టార్మ్ పేసర్ సీవీ మిలింద్, ఆంధ్ర బ్యాట్స్‌మన్ రికీ భుయ్ ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు. గత కొంత కాలంగా టీమిండియా అండర్-19 జట్టులో వీరిద్దరు సభ్యులుగా నిలకడగా రాణిస్తున్నారు. ఈ టోర్నీలో 4 వికెట్లు పడగొట్టిన మిలింద్, కీలకమైన ఫైనల్లో తొలి వికెట్ తీసి జట్టుకు శుభారంభం అందించాడు. టోర్నమెంట్‌లో రెండు అర్ధ సెంచరీలతో రికీ భుయ్ సత్తా చాటాడు.
 
  శ్రీలంకతో జరిగిన సెమీస్‌లో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాదాపు ఇదే జట్టు రాబోయే అండర్-19 ప్రపంచకప్ కూడా ఆడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 14నుంచి మార్చి 1 వరకు యూఏఈలోనే ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఆస్ట్రేలియా గడ్డపై 2012లో అండర్-19 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో హైదరాబాద్‌కు చెందిన హనుమ విహారి సభ్యుడిగా ఉన్నాడు. ఈ సారి మిలింద్, భుయ్ ఉంటారేమో!
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా