కుర్రాళ్లూ కొట్టేశారు 

8 Oct, 2018 01:36 IST|Sakshi

ఆరోసారి అండర్‌–19   ఆసియా కప్‌ కైవసం

ఫైనల్లో శ్రీలంకపై భారీ విజయం

సమష్టిగా రాణించిన బ్యాట్స్‌మెన్‌

ఆరు వికెట్లతో చెలరేగిన హ‌ర్ష్‌

సీనియర్ల విజయాన్ని చూసి స్ఫూర్తి పొందారేమో? కుర్రాళ్లూ వారి బాటలోనే నడిచారు. టీమిండియా ఆసియా కప్‌ను గెల్చుకున్న పది రోజుల్లోనే... అదే స్థాయి టోర్నీలో... అంతకుమించిన ప్రదర్శనతో... టైటిల్‌ను కొట్టేశారు. చక్కటి ఆటతీరుతో మొదటినుంచి ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచిన యువ భారత్‌... తుది సమరంలోనూ అదరగొట్టింది. అద్వితీయ ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో చాంపియన్‌గా అవతరించింది. కప్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ మన జట్టు అజేయంగా నిలవడం విశేషం.  

ఢాకా: అండర్‌–19 కుర్రాళ్లూ... ఆసియా వన్డే కప్‌ను ఒడిసి పట్టేశారు. ఇటీవల సీనియర్లు సాధించిన ఘనతను తామూ అందుకున్నారు. అర్ధ శతకాలతో బ్యాట్స్‌మెన్‌ సమష్టి రాణింపు... ఎడంచేతి వాటం స్పిన్నర్‌ హ‌ర్ష్‌ త్యాగి (6/38) మెరుపులతో ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో టీమిండియా 144 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన యువ భారత్‌ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 304 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (113 బంతుల్లో 85; 8 ఫోర్లు, 1 సిక్స్‌), అనూజ్‌ రావత్‌ (79 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేయగా... కెప్టెన్‌ సిమ్రన్‌ సింగ్‌ (37 బంతుల్లో 65; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆయుష్‌ బదోని (28 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో భారీ స్కోరు అందించారు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ దేవదత్‌ పడిక్కల్‌ (43 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు.

41వ ఓవర్‌ వరకు భారత ఇన్నింగ్స్‌ సాధారణంగానే సాగినా సిమ్రన్, బదోని విజృంభణతో చివరి 55 బంతుల్లో 110 పరుగులు సమకూరాయి. భారీ లక్ష్య ఛేదనలో లంక ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. హ‌ర్ష్‌  త్యాగి, మరో స్పిన్నర్‌ సిద్ధార్థ్‌ దేశాయ్‌ (2/37) ప్రత్యర్థి బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. ఓపెనర్‌ మధుశక ఫెర్మాండో (67 బంతుల్లో 49; 1 ఫోర్, 2 సిక్స్‌లు), పరణవితన (61 బంతుల్లో 48; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే కాస్త ప్రతిఘటించారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 38.4 ఓవర్లలో 160 పరుగులకే పరిమితమై పరాజయం పాలైంది. టోర్నీలో శతకం, రెండు అర్ధ శతకాలతో 318 పరుగులు చేసిన భారత ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కగా,  బౌలర్‌ హర్‌‡్ష త్యాగిని ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం వరించింది.  

►ఆసియా కప్‌ అండర్‌–19 టైటిల్‌ను నెగ్గడం భారత్‌కిది ఆరోసారి. గతంలో 1989, 2003, 2012, 2014, 2016లలో కూడా భారత్‌ విజేతగా నిలిచింది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు