చెత్త ప్రదర్శన.. 41 పరుగులకే ఆలౌట్‌

21 Jan, 2020 16:26 IST|Sakshi

బ్లోమ్‌ఫొంటెన్‌: అండర్‌–19 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో తొలిసారిగా ఆడుతున్న జపాన్‌ జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. మంగళవారం డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు 22.5 ఓవర్లలో 41 పరుగులకే ఆలౌటయింది. దీంతో అండర్‌–19 వరల్డ్‌కప్‌ చరిత్రలో సంయుక్తంగా రెండో అతి తక్కువ పరుగుల రికార్డును నమోదు చేసింది. 2002 అండర్‌–19 వరల్డ్‌ కప్‌లో కెనడా, 2008లో బంగ్లాదేశ్‌ 41 పరుగులకు ఆలౌట్‌ కాగా, 2004లో స్కాట్లాండ్‌ జట్టు 22 పరుగులకే ఆలౌట్‌ అయి మొదటి స్థానంలో నిలిచింది. 

ఇలా వచ్చి అలా.. అందరూ అంతే..
టాస్‌ గెలిచిన యువభారత్‌ కెప్టెన్‌ ప్రియం గార్గ్‌ జపాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అసలే క్రికెట్‌లో కూనలైన జపాన్‌ ఆటగాళ్లు ఏ దశలోనూ భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేదు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ క్రీజులోకి వచ్చీరాగానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఐదో ఓవర్‌లో ఓపెనర్‌ (కెప్టెన్‌) మార్కస్‌ థర్గేట్‌ వికెట్‌తతో మొదలైన పతనం.. 22వ ఓవర్‌ వచ్చే సరికి పూర్తయింది. ఐదో ఓవర్లో రెండు వికెట్లు, ఏడో ఓవర్లో రెండు వికెట్లు, పదో ఓవర్‌లో రెండు వికెట్లను జపాన్‌ జట్టు కోల్పోయింది. మిగతా నాలుగు వికెట్లను 11, 17, 20, 22 ఓవర్లలో సమర్పించుకున్న జపాన్‌.. ప్రత్యర్థి ముందు మోకరిల్లింది. రవి భిష్నోయ్‌ 4, కార్తిక్‌ త్యాగి 3, ఆకాశ్‌ సింగ్‌ 2, విద్యాధర్‌ పాటిల్‌ ఒక వికెట్‌ సాధించారు.


(చదవండి : యువ భారత్‌ శుభారంభం)

డక్‌.. లేదంటే గోల్డెన్‌ డక్‌..
జపాన్‌ బ్యాట్స్‌మెన్‌లో ఐదుగురు డకౌట్‌ కాగా.. వారిలో ఇద్దరు గోల్టెన్‌ డక్‌గా వెనుదిరగడం విశేషం. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు ఒక పరుగు మాత్రమే చేసి ఔట్‌ కాగా.. ముగ్గురు 7, 7, 5 పరుగులతో వికెట్‌ సమర్పించుకున్నారు. ఇక ఈ జపాన్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో వికెట్‌కు నమోదైన 13 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం కావడం విశేషం. జపాన్‌ జట్టు సాధించిన 41 పరుగుల్లో 19 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చినవే కావడం మరో విశేషం. ఇదిలాఉండగా.. శ్రీలంక జరిగిన తొలి మ్యాచ్‌లో యువభారత్‌  భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు