ఇదేమి బౌలింగ్‌ బ్రో..?

8 Nov, 2018 16:25 IST|Sakshi

కళ్యాణి(పశ్చిమబెంగాల్‌): దక్షిణాఫ్రికా మాజీ స్సిన్నర్‌ పాల్‌ ఆడమ్స్‌ బౌలింగ్‌  క్రికెట్‌తో పరిచయం ఉన్న వారికి దాదాపు సుపరిచితమే. అతను స్టార్‌ స్పిన్నర్‌ కాకపోయినా, బౌలింగ్‌ వేసేటప్పుడు తన తలను పూర్తిగా వంచి చిత్రమైన యాక్షన్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆడమ్స్‌. ఆ తరహా బౌలింగ్‌ను ఇప్పటివరకూ మనం చూడకపోయినా, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎంతోమంది బౌలర్ల వింత యాక్షన్‌ను మనం చూస్తునే ఉన్నాం. బౌలర్ల వింత యాక్షన్‌ను కొన్నిసార్లు అంఫైర్లు తప్పుబట్టగా... మరికొన్ని సార్లు ఐసీసీ సైతం కలగజేసుకుని బౌలింగ్ తీరుని మార్చుకోవాల్సిందిగా సూచించిన సందర్బాలు అనేకం.

ఇలా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ అనేక సార్లు అంఫైర్ల వార్నింగ్‌లు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు.  తాజాగా, అండర్-23 సీకే నాయుడు టోర్నీలో భాగంగా ఇటీవల జరిగిన ఓ మ్యాచ్‌లో 360 డిగ్రీలు తిరిగి బంతి వేశాడు యూపీ స్పిన్నర్‌ శివ సింగ్‌. వివరాల్లోకి వెళితే ఉత్తర్‌ప్రదేశ్, బెంగాల్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన లెఫ్టామ్ స్పిన్నర్ శివ సింగ్ కాస్త వింతగా బౌలింగ్ చేశాడు.  అతడు 360 డిగ్రీలు తిరిగి మరీ బంతిని విసిరాడు. దాంతో అంపైర్ వినోద్ శేషన్ దానిని డెడ్ బాల్‌గా ప్రకటించాడు.

దీనిపై బౌలర్ నిరసన వ్యక్తం చేయగా ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు అతనికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఐసీసీ రూల్స్‌లో ఇలాంటి చర్యలకు ఏం చేయాలన్న దానిపై ప్రత్యేకంగా ఓ చట్టం అంటూ లేకపోవడంతో అంఫైర్ తీసుకున్న నిర్ణయం సరైందా? లేదా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. అయితే చట్టంలో 41.2 ప్రకారం ఓ ప్లేయర్ చర్య సరిగా ఉందా? లేదా తేల్చే హక్కు మాత్రం అంపైర్‌కు మాత్రమే ఉంది. బ్యాట్స్‌మన్ ఏకాగ్రతను దెబ్బ తీయడానికి కావాలని బౌలర్ ఇలా చేశాడని అంపైర్ భావించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతను స్వతహాగా ఇదే యాక్షన్‌తో బౌలింగ్‌ చేసిన సందర్బాలు లేవు. బ్యాట్స్‌మన్‌కు గందరగోళంలో పడేయడానికే ఇలా చేశాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ అన్ని బంతులు అలాగే వేయడానికి సిద్ధమైతే మాత్రం ఆ యాక్షన్‌తో బౌలింగ్‌కు అనుమతి ఇవ్వొచ్చని దేశవాళీ అంపైర్‌ ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు