కట్టుతో ‘శత’క్కొట్టి...

6 Feb, 2018 01:07 IST|Sakshi
ఉన్ముక్త్‌ చంద్‌

ఉన్ముక్త్‌ చంద్‌ సాహసోపేత ఇన్నింగ్స్‌   

బిలాస్‌పూర్‌: పదహారేళ్ల క్రితం వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత దిగ్గజం అనిల్‌ కుంబ్లే గాయపడినా కూడా తలకు కట్టుతో బరిలోకి దిగడం గుర్తుందా! ఇప్పుడు దాదాపు అదే తరహాలో ఢిల్లీ యువ బ్యాట్స్‌మన్‌ ఉన్ముక్త్‌ చంద్‌ మైదానంలోకి దిగి బ్యాటింగ్‌లో సత్తా చాటాడు. సోమవారం ఉత్తరప్రదేశ్‌తో జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌కు ముందు నెట్‌ ప్రాక్టీస్‌లో ఉన్ముక్త్‌ దవడకు బలమైన దెబ్బ తగిలింది.

ఇక మ్యాచ్‌కు దూరం కావడం ఖాయమే అనిపించింది. అయితే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వద్దంటున్నా వినకుండా చంద్‌ ఆడేందుకు సన్నద్ధమయ్యాడు. 125 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 116 పరుగులు చేసిఢిల్లీ 307 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఉత్తరప్రదేశ్‌ 252 పరుగులకే ఆలౌటై 55 పరుగులతో ఓటమిపాలైంది. ఉన్ముక్త్‌ పట్టుదలపై భారత క్రికెట్‌ వర్గాల్లో భారీ ఎత్తున ప్రశంసలు కురిశాయి.    

>
మరిన్ని వార్తలు