‘పచ్చని’ పిచ్‌పై అందరి చూపు!

28 Oct, 2017 10:52 IST|Sakshi

కాన్పూర్‌: భారత్, న్యూజిలాండ్‌ మధ్య ఆదివారం జరగాల్సిన మూడో వన్డేను సమర్థంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (యూపీసీఏ) అధికారులు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుణేలో జరిగిన రెండో వన్డే సందర్భంగా పిచ్‌ను మార్చగలనంటూ క్యురేటర్‌ చేసిన వ్యాఖ్యలు బయటపడటం... ఆ తర్వాత ఐసీసీ విచారణ, తదనంతర పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడి గ్రీన్‌ పార్క్‌ స్టేడియంలో పిచ్‌ భద్రత విషయంలో ఎలాంటి వివాదం రాకూడదని యూపీసీఏ భావిస్తోంది.

తగిన గుర్తింపు కార్డులు లేకుండా అసలు స్టేడియం పరిధిలోకి ఎవరూ రాకూడదని, పిచ్‌ స్వభావం గురించి గ్రౌండ్స్‌మన్‌ ఎవరూ నోరు విప్పవద్దని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ‘పుణే ఘటన తర్వాత మేం మరింత అప్రమత్తతతో ఉంటున్నాం. పోలీసుల సూచనలతో భద్రతను ఇంకా కట్టుదిట్టం చేశాం’ అని యూపీసీఏ కార్యదర్శి యుధ్‌వీర్‌ సింగ్‌ అన్నారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ సమయంలో ఇదే మైదానంలో పని చేస్తూ బుకీలతో సంబంధాలు నెరపి వివాదాస్పదంగా వ్యవహరించిన ప్లంబర్‌ శివకుమార్‌ తిరిగొచ్చి పిచ్‌ తయారీలో అనధికారికంగా సహకరిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు