ఫిఫా ప్రపంచకప్‌లో మరో పెను సంచలనం

1 Jul, 2018 07:59 IST|Sakshi

ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసిన పోర్చుగల్‌ పోరాటం

మరో ఫేవరేట్‌ జట్టు నిష్ర్కమణ

మెస్సీ దారిలోనే రొనాల్డో

రెండు గోల్స్‌ కొట్టిన ఉరుగ్వే ఫార్వర్డ్‌ ప్లేయర్‌ ఎడిన్సన్‌ కావనీ

ఎన్నో అంచనాలు.. మరెన్నో ఆశలు.. ఈసారైనా ఈ దిగ్గజ ఆటగాడు కప్‌ గెలుస్తాడనుకున్నారు.. కానీ అతని పయనం మెస్సీ దారిలోనే నడిచింది. ప్రపంచకప్‌ తీరని కలగానే మిగిలింది క్రిస్టియానో రొనాల్డోకు.. ఎక్కువ సేపు బంతి ఆధీనంలో ఉన్నా గోల్‌ చేయలేని నివ్వెర పరిస్థితి రొనాల్డో సేనది.. లీగ్‌ దశలో ఓటమెరుగని ఉరుగ్వే.. అదే పోరాటం, కసితో ఆడి పోర్చుగల్‌పై పోరాడి గెలిచింది. క్వార్టర్‌ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను ఢీ కొట్టడానకి సై అంటోంది.  

సోచి : ఫిఫా ప్రపంచకప్‌లో మరో దిగ్గజ జట్టు పోరాటం ముగిసింది. ఎన్నో అంచనాల నడుమ సాకర్‌ సమరంలో అడుగుపెట్టిన పోర్చుగల్‌ కథ ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో నాకౌట్‌ పోరులొ ఉరుగ్వే 2-1తో పోర్చుగల్‌పై ఘన విజయం సాధించింది. తొలి క్వార్టర్‌ ఫైనల్‌లో జులై 6న ఫ్రాన్స్‌తో తలపడనుంది. మ్యాచ్‌ ప్రారంభమైన ఏడు నిమిషాలకే రోనాల్డో సేనకు దిమ్మ తిరిగే పంచ్‌ ఇచ్చాడు ఉరుగ్వే ఫార్వర్డ్‌ ప్లేయర్‌ ఎడిన్సన్‌ కావనీ. సువారెజ్‌ ఇచ్చిన పాస్‌ను ఈ స్టార్‌ స్ట్రైకర్‌ హెడర్‌ గోల్‌ చేసి ఉరుగ్వేకు తొలి గోల్‌ అందించాడు. అనంతంరం ఫ్రికిక్‌ రూపంలో వచ్చిన అవకాశాన్ని రొనాల్డో మిస్‌ చేశాడు. మరో గోల్‌ నమోదు కాకుండానే తొలి భాగం ముగిసింది.

ద్వితీయార్థం ముగియగానే దాడిని మరింత పెంచిన రొనాల్డో సేనకు ఫలితం లభించింది. 55వ నిమిషంలో క్రిస్టియానో రొనాల్డో ఇచ్చిన పాస్‌తో డిఫెండర్‌ పెపె గోల్‌ చేయడంతో ఇరు జట్ల స్కోర్‌ సమం అయ్యాయి. పోర్చుగల్‌ శిభిరంలో ఆనంద ఎంతో సేపు నిలువలేదు. రొనాల్డో సేన డిఫెండింగ్‌ వైఫల్యంతో ఎడిన్సన్‌ కావనీ మరో అద్భుతమైన గోల్‌ చేయడంతో ఉరుగ్వే 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.  ఇరు జట్లు మరో గోల్‌ కోసం పోటీపడినా ఇరు జట్ల రక్షణశ్రేణి సమర్ధవంతంగా అడ్డుకున్నాయి.

ఇక ఎక్సట్రా ఇంజ్యూరీ టైమ్‌లో కూడా మరో గోల్‌ నమోదు చేయలేకపోయిన పోర్చుగల్‌ ఓటమితో నిష్క్రమించింది. మ్యాచ్‌లో 63 శాతం బంతి పోర్చుగల్‌ ఆధీనంలో ఉన్నా గోల్‌ చేయటంలో స్ట్రైకర్‌లు విఫలమ్యారు. రొనాల్డో సేన ఎనిమిది సార్లు గోల్‌ కోసం ప్రయత్నించి విఫలమయింది. ఈ మ్యాచ్‌లో ఏకైక ఎల్లో కార్డు రిఫరీలు రొనాల్డోకు చూపించారు. పోర్చుగల్‌ 12 అనవసర తప్పిదాలు చేయగా ఉరగ్వే 13 తప్పిదాలు చేసింది. 

మరిన్ని వార్తలు