ఆఖర్లో అద్భుతం

25 Jun, 2014 01:01 IST|Sakshi
ఆఖర్లో అద్భుతం

నాకౌట్ దశకు ఉరుగ్వే అర్హత
 ఇటలీపై 1-0తో గెలుపు
 కీలకగోల్ చేసిన గోడిన్
 లీగ్ దశలోనే నిష్ర్కమించిన మాజీ విజేత
 
 నటాల్: మరో తొమ్మిది నిమిషాలు గడిస్తే ఉరుగ్వే ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించేది. గోల్ చేసేందుకు పలుమార్లు ప్రయత్నించినా దుర్బేధ్యంగా ఉన్న ఇటలీ రక్షణశ్రేణిని ఆ జట్టు ఛేదించలేకపోయింది. ఆశలు వదులుకుంటున్న వేళ అద్భుతం జరిగింది. ఆట 81వ నిమిషంలో లభించిన కార్నర్‌ను గాస్టన్ రమిరెజ్ సంధించగా... గోల్‌పోస్ట్ ముందు ఉరుగ్వే కెప్టెన్ గోడిన్ ‘హెడర్’ షాట్‌తో బంతిని లక్ష్యానికి చేర్చాడు.
 
 అంతే ఉరుగ్వే శిబిరంలో ఎక్కడలేని ఆనందం. అప్పటిదాకా ‘డ్రా’ ఖాయమనుకున్న మ్యాచ్ మలుపు తిరిగిం ది. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఇటలీ లీగ్ దశలోనే నిష్ర్కమణకు కారణమైంది. చివరిదాకా ఉత్కంఠభరితంగా సాగిన గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో ఉరుగ్వే 1-0తో ఇటలీని ఓడించింది. ప్రపంచకప్ చరిత్రలో ఇటలీపై ఉరుగ్వేకిదే తొలి విజయం. గతంలో రెండుసార్లు ఇటలీతో ఆడిన ఉరుగ్వే కనీసం గోల్ కూడా నమోదు చేయలేకపోయింది. మూడో ప్రయత్నంలో మాత్రం మాజీ చాంపియన్‌కు షాక్ ఇచ్చింది. 1966 ప్రపంచకప్ తర్వాత ఇటలీ జట్టు వరుసగా రెండు ప్రపంచకప్‌లలో లీగ్ దశలోనే వెనుదిరగడం ఇదే ప్రథమం. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఇటలీ 2010 ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.
 
 రెండు జట్లకు చావోరేవోలాంటి మ్యాచ్ కావడంతో తొలి అర్ధభాగంలో హోరాహోరీగా పోటీపడ్డాయి. నిమిషాలు గడుస్తున్నకొద్దీ ‘ఫౌల్స్’ సంఖ్య కూడా అదేరీతిలో పెరిగింది.
 
 ఆట 23వ నిమిషంలో అయితే ఇటలీ స్టార్ ప్లేయర్ బలోటెలి బంతి కోసం గాల్లోకి అమాంతం ఎగిరి నేరుగా ఉరుగ్వే ఆటగాడు అల్వారో పెరీరా మెడభాగంలో పడ్డాడు. బలోటెలి చర్యకు రిఫరీ వెంటనే స్పందించి అతనికి ఎల్లో కార్డు చూపెట్టారు.  
 
 60వ నిమిషంలో ఇటలీకి ఎదురుదెబ్బ తగిలింది. బంతితో దూసుకెళ్తున్న క్రమంలో ఇటలీ ఆటగాడు క్లాడియో మర్చిసియో ప్రత్యర్థి ప్లేయర్ అరెవాలో కాళ్లపై మొరటుగా తన్నాడు. రిఫరీ ‘ఫౌల్’ తీవ్రత దృష్ట్యా మర్చిసియోకు ‘రెడ్ కార్డు’ ఇచ్చి మైదానం నుంచి బయటకు పంపించారు. దాంతో ఇటలీ 10 మంది ఆటగాళ్లకే పరిమితమైంది. ఈ సువర్ణావకాశాన్ని ఉరుగ్వే ఆటగాళ్లు చివర్లో సద్వినియోగం చేసుకున్నారు. అద్భుత విజయంతో నాకౌట్‌కు చేరారు.

మరిన్ని వార్తలు