మ్లాడెనోవిచ్ మెరుపులు

8 Sep, 2015 01:14 IST|Sakshi
మ్లాడెనోవిచ్ మెరుపులు

ఈసారి యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సీడెడ్ క్రీడాకారిణులకు అంతగా పేరులేని ప్రత్యర్థులు చుక్కలు చూపిస్తున్నారు. యువతారల ధాటికి టాప్-20 సీడింగ్స్ నుంచి కేవలం నలుగురు మాత్రమే బరిలో మిగిలారు. అనామక క్రీడాకారిణులను తక్కువ అంచనా వేయకూడదని నిరూపిస్తూ... ఫ్రాన్స్ అమ్మాయి క్రిస్టినా మ్లాడెనోవిచ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ ఎకతెరీనా మకరోవాను ఇంటిదారి పట్టించి తన కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.
 
- 13వ సీడ్ మకరోవాపై సంచలన విజయం  
- తొలిసారి ‘గ్రాండ్‌స్లామ్’ క్వార్టర్స్‌లోకి వీనస్‌తో సెరెనా అమీతుమీ
- యూఎస్ ఓపెన్ టోర్నీ
న్యూయార్క్:
సమకాలీన మహిళల టెన్నిస్‌లో సీడింగ్ లేకున్నా వారి ప్రతిభను తక్కువ అంచనా వేసే పరిస్థితి కనిపించడంలేదు. యూఎస్ ఓపెన్‌లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ఈసారి అన్‌సీడెడ్ క్రీడాకారిణులు అదరగొట్టే ఫలితాలు సాధిస్తున్నారు. తాజాగా 22 ఏళ్ల క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) అద్భుత పోరాటంతో ఆకట్టుకొని 13వ సీడ్  మకరోవా (రష్యా)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మ్లాడెనోవిచ్ 7-6 (7/2), 4-6, 6-1తో మకరోవాపై గెలిచింది. తొలి రౌండ్‌లో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా)ను ఓడించిన మ్లాడెనోవిచ్ అదే జోరును కొనసాగిస్తూ తన కెరీర్‌లో 20వ ప్రయత్నంలో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది.

రెండు గంటల 12 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మ్లాడెనోవిచ్ నిర్ణాయక మూడో సెట్‌లో చెలరేగి ఆడింది. మకరోవా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో 20వ సీడ్ అజరెంకా (బెలారస్) 6-3, 6-4తో లెప్‌చెంకో (అమెరికా)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరింది. ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ వేటలో టాప్ సీడ్ సెరెనా (అమెరికా) దూసుకుపోతోంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సెరెనా 6-3, 6-3తో 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)ను ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో తన సోదరి వీనస్ విలియమ్స్ (అమెరికా)తో సెరెనా తలపడుతుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో వీనస్ 6-2, 6-1తో కొంటావీట్ (ఎస్తోనియా)పై గెలిచింది.
 
జొకోవిచ్ ముందంజ

పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా)తోపాటు 18వ సీడ్ లోపెజ్ (స్పెయిన్), 19వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) క్వార్టర్ ఫైనల్లోకి చేరారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జొకోవిచ్ 6-3, 4-6, 6-4, 6-3తో అగుట్ (స్పెయిన్)పై, లోపెజ్ 6-3, 7-6 (7/5), 6-1తో ఫాగ్‌నిని (ఇటలీ)పై, సోంగా 6-4, 6-3, 6-4తో పెయిర్ (ఫ్రాన్స్)పై గెలిచారు.
 
క్వార్టర్స్‌లో సానియా ద్వయం
మహిళల డబుల్స్ మూడో రౌండ్‌లో సానియా మీర్జా (భారత్) -మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట 6-3, 6-0తో మిచెల్లా క్రాయిసెక్ (నెదర్లాండ్స్)-స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పురుషుల డబుల్స్ మూడో రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం 6-7 (4/7), 6-4, 6-3తో నెస్టర్ (కెనడా)-వాసెలిన్ (ఫ్రాన్స్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.

మరిన్ని వార్తలు