-

స్విమ్మర్ లోక్టేపై కేసు నమోదు

26 Aug, 2016 11:57 IST|Sakshi
స్విమ్మర్ లోక్టేపై కేసు నమోదు

రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్ సందర్భంగా కొంతమంది దొంగలు కత్తులతో బెదిరించి విలువైన వస్తువులను అపహరించుకుపోయారంటూ తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన అమెరికా స్టార్ స్విమ్మర్ ర్యాన్ లోక్టేపై కేసు నమోదయ్యింది. తాజాగా లోక్టేపై బ్రెజిల్ పోలీసులు కేసు నమోదు చేయడంతో అతనికి జైలు శిక్ష పడే అవకాశం కనబడుతోంది.  

గతవారం రియో ఒలింపిక్స్లో తనతో పాటు మరో ఇద్దరు స్విమ్మర్లు ఒక అర్ధరాత్రి పార్టీ వెళుతుండగా కొంతమంది దొంగలు బెదిరించి తమ వద్ద నగదును దొంగిలించారంటూ లోక్టే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు లోక్టే ఇచ్చిన ఫిర్యాదు నమ్మకశక్యంగా లేదని తేల్చారు. లోక్టేతో పాటు ఉన్న మిగతా ఇద్దరు స్విమ్మర్లు కూడా ఎటువంటి దొంగల బారిన పడలేదని రియో పోలీస్ చీఫ్ ఫెర్నాండో వెలాసో స్పష్టం చేశారు. ఆ దీనికి సంబంధించిన తుది నివేదికను కోర్టు ముందుంచారు. ఒకవేళ లోక్టే తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు కోర్టు భావిస్తే అతనికి సమన్లు జారీ చేయడంతో పాటు ఒకటి నుంచి ఆరు నెలల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని సదరు పోలీస్ అధికారి పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్లో 4x 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో లోక్టే స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే.


గతవారం స్విమ్మర్లు జాక్ కాంగర్, గున్నార్ బెంట్జ్లతో కలిసి ట్యాక్సీలో  సెంట్రల్ రియోలో పార్టీకి వెళుతున్నప్పుడు దొంగల బారిన పడినట్లు పేర్కొన్నాడు. అయితే దీనిపై బ్రెజిల్ అధికారులు సీరియస్గా దృష్టి సారించడంతో అది కాస్తా తప్పుడు ఫిర్యాదు అని తేలింది. స్విమ్మర్లు  జాక్ కాంగర్, గున్నార్ బెంట్జ్లు అమెరికాకు బయల్దేరిన క్రమంలో వారిని విమానం నుంచి దింపి మరీ పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో లోక్టే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాడు. దీనిపై బ్రెజిల్ అధికారులను క్షమాపణలు కూడా కోరాడు. తాను మోసపూరితమైన ఫిర్యాదు చేసినట్లు లోక్టే తెలిపాడు.

మరిన్ని వార్తలు