ట్రాక్‌పైకి మళ్లీ రాను: బోల్ట్‌

15 Aug, 2017 00:36 IST|Sakshi
ట్రాక్‌పైకి మళ్లీ రాను: బోల్ట్‌

లండన్‌: వీడ్కోలు పరుగును విషాదంగా ముగించిన స్ప్రింట్‌ దిగ్గజం ఉసేన్‌ బోల్ట్‌ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ‘మళ్లీ బరిలోకి దిగను. రిటైరయ్యాక తిరిగి బరిలోకి దిగిన చాలా మందిని నేను చూశాను. తిరిగొచ్చాక వాళ్లు తమ స్థాయిని కోల్పోయి అభాసుపాలయ్యారు. అలాంటి వాళ్ల జాబితాలో నేను ఉండబోను’ అని ఆదివారం రాత్రి ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ ముగింపు సందర్భంగా బోల్ట్‌ అన్నాడు. ఈ చాంపియన్‌షిప్‌లో తన విజయవంతమైన కెరీర్‌ను మోయలేని భారంతో ముగించిన మాట వాస్తవమేనని అతను అంగీకరించాడు.

తనతో ఒకరు ‘బాక్సింగ్‌ దిగ్గజం మొహమ్మద్‌ అలీ కూడా చివరి బౌట్‌లో ఓడాడు. కాబట్టి తీవ్రంగా ఆలోచించకు’ అని చెప్పడం ఎంతో కదిలించిందని బోల్ట్‌ అన్నాడు. తన భవిష్యత్‌ కార్యచరణపై మాట్లాడుతూ క్రీడలకు అంబాసిడర్‌గా కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. దీనిపై ఐఏఏఎఫ్‌ అధ్యక్షుడు సెబాస్టియన్‌ కో తో తన సిబ్బంది చర్చలు జరుపుతున్నారన్నాడు. జమైకన్‌ కోచింగ్‌ బృందంలో సహాయ పాత్ర పోషించేందుకు సిద్ధమన్నాడు. 30 ఏళ్ల బోల్ట్‌ తనకు 50 ఏళ్లు వచ్చేసరికి ఎలా ఉంటాడో కూడా వివరించాడు. ‘ప్రత్యేకించి ఏ ఆలోచనా లేదు... కానీ పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లల్ని కనాలి. అయితే వారిని స్ప్రింట్‌వైపు తీసుకొస్తానో లేదో తెలీదు. అందరి తల్లిదండ్రుల్లా నా ఆలోచనల్ని బలవంతంగా వాళ్లపై రుద్దను’ అని అన్నాడు.

ఇక మీ తక్షణ లక్ష్యాలేంటి అన్న ప్రశ్నకు ‘పార్టీ చేసుకోవడం, తాగడం, తిరగడం’ అని నవ్వుతూ బదులిచ్చాడు. పోటీల చివరిరోజు బోల్ట్‌ లండన్‌ ఒలింపిక్‌ స్టేడియం మొత్తం కలియదిరిగి అభిమానులకు అభివాదం చేశాడు. తాను పరుగెత్తిన ట్రాక్‌ను ముద్దాడాడు. చిన్నారులతో కలిసి ఫొటోలు దిగాడు. ఈ సందర్భంగా 2012 ఒలింపిక్స్‌లో ఇదే వేదికపై మూడు స్వర్ణాలు గెలిచిన బోల్ట్‌కు ఆ ట్రాక్‌లోని భాగాన్ని మెమెంటోగా లండన్‌ మేయర్‌ సాదిక్‌ ఖాన్, ఐఏఏఎఫ్‌ అధ్యక్షుడు సెబాస్టియన్‌ కో అందజేశారు.  

అమెరికాకు అగ్రస్థానం: ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో అమెరికా 10 స్వర్ణాలు, 11 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 30 పతకాలు గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. కెన్యా (5 స్వర్ణాలు, 2 రజతాలు, 4 కాంస్యాలు) 11 పతకాలతో రెండో స్థానంలో, దక్షిణాఫ్రికా (3 స్వర్ణాలు, రజతం, 2 కాంస్యాలు) ఆరు పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి.

మరిన్ని వార్తలు