'వాడా’ వార్నింగ్ సరికాదు: బోల్ట్

19 Nov, 2013 20:36 IST|Sakshi

మొనాకో: జమైకా స్టార్, స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (వాడా) హెచ్చరికలపై మండిపడ్డాడు. తాజాగా ఐదో సారి ‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికైన ఒలింపిక్ చాంపియన్... వాడా వార్నింగ్‌లతో తను రూ. కోట్ల విలువైన స్పాన్సర్‌షిప్‌లు కోల్పోతానని వాపోయాడు. జమైకాకు చెందిన చాలా మంది అథ్లెట్లు ఇటీవల డోప్ టెస్టుల్లో పట్టుబడ్డారు. దీంతో విచారణకు అదేశించిన వాడా డోపీలపై కఠిన చర్యలుంటాయని, ఏకంగా జమైకా అథ్లెట్లందరినీ రియో ఒలింపిక్స్ (2016)లో పాల్గొనకుండా వేటు వేస్తామని గట్టిగా హెచ్చరించింది. దీనిపై స్పందించిన బోల్ట్ ‘వాడా నిర్ణయం నన్ను నిరాశపరిచింది.

 

అది నిజంగా నా ఆదాయానికి గండికొట్టే హెచ్చరిక. నాకు తెలిసిందల్లా ట్రాక్ అండ్ ఫీల్డే. అదే నా లోకం. ఇందులో రాణించేందుకు ఎంతో కష్టపడతా. వాడా, ఐఏఏఎఫ్‌ల నుంచి ఎన్నో పరీక్షలెదుర్కొంటా’నని అన్నాడు. కానీ వ్యక్తిగత పరీక్షల ఆధారంగా కాకుండా ఏకంగా టీమ్ మొత్తాన్ని నిషేధిస్తామనడం సబబు కాదని అన్నాడు. దీని వల్ల తనకు ఎండార్స్‌మెంట్లు తెచ్చే ఏజెంట్లు అయోమయానికి గురవుతారని... తాను ఆ జాబితాలో ఉన్నాననే అనుమానంతో స్పాన్సర్‌షిప్‌లు కట్టబెట్టరని బోల్ట్ వివరించాడు. తప్పుచేసినవారిపైనే చర్యలుండాలని, అంతే గానీ టీమ్ మొత్తంపై వేటు తగదన్నాడు.
 

మరిన్ని వార్తలు