డైమండ్ లీగ్‌లో బోల్ట్ హవా

8 Jul, 2013 05:38 IST|Sakshi

 పారిస్: మెరుపు వేగంతో దూసుకెళ్తూ ఒలింపిక్ చాంపియన్ ఉసేన్ బోల్ట్ ఈ ఏడాది తొలి స్వర్ణాన్ని సాధిం చాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన డైమండ్ లీగ్ మీట్‌లో ఈ ‘జమైకా చిరుత’ 200 మీటర్ల రేసులో విజేతగా నిలిచాడు. 19.73 సెకన్లలో రేసును పూర్తి చేసిన బోల్ట్ ఈ ఏడాది ఈ విభాగంలో అత్యుత్తమ సమయాన్ని నమోదు చేసిన అథ్లెట్‌గా నిలిచాడు.

వారెన్ వీర్ (జమైకా-19.92 సెకన్లు), క్రిస్టోఫ్ లెమైట్రి (ఫ్రాన్స్-20.07 సెకన్లు) వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు. ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గొప్ప రేసును చూడబోతున్నారు. క్లైమాక్స్‌లాంటి దానికి నేనూ సిద్ధం కావాలనుకుంటున్నాను’ అని బోల్ట్ వ్యాఖ్యానించాడు. ఈ చాంపియన్‌షిప్ ఆగస్టు 10 నుంచి 18 వరకు మాస్కోలో జరుగుతుంది.
 
 వికాస్ గౌడకు నాలుగో స్థానం
 ఇదే ఈవెంట్ పురుషుల డిస్కస్ త్రోలో భారత అథ్లెట్ వికాస్ గౌడ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. గతవారం పుణేలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని నెగ్గిన వికాస్ ఇక్కడ డిస్క్‌ను 64.45 మీటర్ల దూరం విసిరాడు.
 

మరిన్ని వార్తలు