బోల్ట్ తినేది బీఫ్ కాదట!!

30 Aug, 2016 09:14 IST|Sakshi
బోల్ట్ తినేది బీఫ్ కాదట!!

ఉసేన్ బోల్ట్ బీఫ్ తింటాడని, అందుకే అతడు రియో ఒలింపిక్స్‌లో పతకాలు మూటగట్టుకుని మరీ వెళ్లాడని బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. అసలు నిజంగా బోల్ట్ ఏం తింటాడని ఒక్కసారిగా అందరూ వెతకడం మొదలుపెట్టారు. దాంతో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. జమైకా లాంటి చిన్న దేశంలో, ఓ పేద కుటుంబంలో పుట్టిన బోల్ట్ చిన్నతనం నుంచి సన్నగానే ఉండేవాడు. 15 ఏళ్లకే ఆరు అడుగులకు పైగా పొడవు పెరిగిన బోల్ట్.. తొలుత ఆడింది క్రికెట్ అట!! ఆ తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్ వైపు మారాడు.

జమైకా నుంచి వచ్చిన అసఫా పావెల్, షెల్ ఆన్ ఫ్రేజర్, బోల్ట్.. ఈ ముగ్గురూ సాధారణ నేపథ్యం ఉన్నవాళ్లే తప్ప డబ్బున్న ఆసాములు కారు. దాంతో సర్వసాధారణంగా జమైకాలో దొరికే బియ్యం, చేపలు.. ఇవే వీరికి కూడా ఆహారం అయ్యాయి. బోల్ట్ కోచ్ కూడా ఎప్పుడూ అతడిని బీఫ్ తినమని చెప్పలేదు.

ఇప్పుడంటే తాను ఎక్కడకు వెళ్లినా తనతో పాటు పర్సనల్ చెఫ్ ఉంటాడని బోల్ట్ చెప్పాడు. ఇప్పటికీ తన భోజనంలో మాత్రం చికెన్, కూరగాయలే ఎక్కువగా ఉంటాయన్నాడు. జమైకన్ ఆహారంలో ప్రధానంగా ఉండే బియ్యం, చికెన్, కూరగాయలే తనకు ఇప్పటికీ ఇష్టమని.. విదేశాలకు వెళ్లినప్పుడు సరైన ఆహారం దొరక్కపోతే ఏ బర్గర్ కింగ్‌కో, మెక్‌ డోనాల్డ్స్‌కో వెళ్లాల్సి ఉంటుందని అన్నాడు.  తన ఆహారంలో ప్రధానంగా చికెన్, పోర్క్, చేపలు, దుంపకూరలు ఉంటాయని తెలిపాడు. వీటివల్ల శరీరానికి కావల్సిన కార్బోహైడ్రేట్లు బాగా అందుతాయి. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మాత్రం ఫాస్ట్ ఫుడ్ తింటుంటానని, కానీ తన ఆహారంలో 90 శాతం మంచిదే ఉంటుందని వివరించాడు.

ఇక ఇప్పటికి ఒలింపిక్స్‌లో 23 స్వర్ణపతకాలతో కలిపి మొత్తం 28 పతకాలు సాధించిన మైఖేల్ ఫెల్ప్ప్ కూడా బాగా ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకుంటాడు తప్ప బీఫ్ కాదు. అతడు తీసుకునే 12వేల కేలరీల ఆహారంలో చికెన్, పాస్తా, పిజ్జా, చేపలు ఉంటాయి. పీవీ సింధు లాంటి వాళ్లను ఒలింపిక్ విజేతలుగా తీర్చిదిద్దే కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా తన శిష్యులను తగినంత సామర్థ్యం కోసం చికెన్ తినమని చెబుతారట.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు