ధోని కాదు..మరి ఊతప్ప ఫేవరెట్‌ కెప్టెన్‌ ఎవరు?

9 Apr, 2020 16:39 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనితో అత్యంత సన్నిహితంగా మెలిగిన వారిలో  వెటరన్‌ ఆటగాడు రాబిన్‌ ఊతప్ప ఒకడు. ఒకానొక  సందర్భంలో ధోని-ఊతప్పలే ఎక్కువగా కనిపించేవారు. ఆపై మెల్లగా ఊతప్ప భారత  జట్టుకు దూరం కావడంతో ధోనితో సాన్నిహిత్యాన్ని కూడా తగ్గించేశాడు. 2015లో భారత జట్టులో చివరిసారి కనిపించిన ఊతప్పకు మళ్లీ అవకాశం రాలేదు. కేవలం అడపా దడపా దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతున్న ఊతప్ప.. ఐపీఎల్‌లో మాత్రం కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో కేకేఆర్‌ అతన్ని వదులు కోగా, రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 3 కోట్లకు కొనుగోలుచేసింది. ఇప్పటివరకూ 177 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన ఊతప్ప 4,411 పరుగులు చేశాడు.  ఇందులో 24కు పైగా యాభైకి పైగా స్కోరులు ఉన్నాయి. (ధోని గేమ్‌ మార్చాడు.. అందుకే పట్టు కోల్పోయాడు)

2014లో కేకేఆర్‌ జట్టులోకి అడుగుపెట్టిన ఊతప్ప.. 2017 వరకూ గౌతం గంభీర్‌ సారథ్యంలో కేకేఆర్‌కు ఆడాడు. 2014 సీజన్‌లో 44 సగటుతో 660 పరుగులు చేసి  కేకేఆర్‌ టైటిల్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో ఆరంజ్‌ క్యాప్‌ను అందుకున్నాడు. అయితే తన ఫేవరెట్‌ కెప్టెన్‌ ఎవరని అడిగితే గౌతం గంభీర్‌ అని ఊతప్ప చెప్పుకొచ్చాడు. ఓవరాల్‌గా రాహుల్‌ ద్రవిడ్‌, ధోని, గంభీర్‌ కెప్టెన్సీల్లో ఆడిన ఊతప్ప.. గంభీర్‌కే ఓటేశాడు.  తనకు గంభీర్‌ కెప్టెన్సీ అంటే అత్యంత ఇష్టమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఈ ముగ్గురిలో మీ ఫేవరెట్ కెప్టెన్ ఎవరు..? అని ప్రశ్నించగా గంభీర్‌ అని బదులిచ్చాడు. ‘ గౌతీ భాయ్‌ నా ఫేవరెట్‌ కెప్టెన్‌. మైదానంలో అతను చాలా సౌమ్యంగా ఉంటాడు. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడడు. ఎవరి ఏది చెప్పాలో అంత వరకే చెప్తాడు. ఆటగాళ్ల ప్రతిభను వెలికితీయడంలో గంభీర్‌ దిట్ట. గంభీర్‌ లాంటి మంచి కెప్టెన్‌ ఉంటే మనకు  ఎటువంటి అభద్రతా భావం ఉండదు’ అని ఊతప్ప తెలిపాడు. 2014 కంటే ముందు గంభీర్‌ కెప్టెన్సీలో కేకేఆర్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.  2012లో చెన్నైతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కేకేఆర్‌ విజయం సాధించి తొలిసారి ఐపీఎల్‌ టైటిల్‌ను ముద్దాడింది. (అక్తర్‌ వ్యాఖ్యలకు కపిల్‌ కౌంటర్‌)

మరిన్ని వార్తలు